USA: 205 అడుగుల ఎత్తులో ఆగిన రోలర్ కోస్టర్

రోలర్ కోస్టర్ రైడ్ అంటే కొంతమందికి మహా సరదా. అడ్వెంచర్ ఇష్టపడేవారు అలా ఎత్తు పల్లాల్లో వేగంగా దూసుకుపోయే ఈ రైడ్ చెయ్యడానికి రెడీగా ఉంటారు..ప్రాణం గాల్లో తేలుతూ ఉండటాన్ని భలే ఎంజాయ్ చేస్తారు. కానీ ఇదే రోలర్ కోస్టర్ రైడ్‌లో ఏదైనా అపశ్రుతి దొర్లితే జరిగే ఏం జరుగుతుందో ఊహకు కూడా అందదు.
అమెరికాలోని ఒహియో రాష్ట్రంలో ఓ రోలర్‌కోస్టర్ 205 అడుగుల ఎత్తులో అకస్మాత్తుగా ఆగిపోయింది. సరదాగా రైడ్ ఎంజాయ్ చేద్దామని ఎక్కినవారు భయంతో బిక్క చచ్చిపోయారు. శాన్‌డస్కీలో అమ్యూజ్‌మెంట్ పార్క్‌లో జరిగిందీ ఘటన. సాంకేతిక కారణాలతో ఆగిపోయిన రోలర్‌కోస్టర్‌ను తిరిగి ప్రారంభించడానికి ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. దీంతో పైన చిక్కుకున్న వారిని ఇతర పద్ధతుల ద్వారా జాగ్రత్తగా కిందికి దింపారు. ఈ ఘటనలో అందరూ క్షేమంగా ఉండడంతో సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
1989లో ప్రవేశపెట్టిన ఈ మాగ్నమ్ ఎక్స్ఎల్-200 గా పిలిచే ఈ రోలర్‌కోస్టర్ 200 అడుగుల పొడవుతో ప్రపంచంలోనే అతిపొడవైన రోలర్‌కోస్టర్‌గా గిన్నిస్ రికార్డుల్లో చోటు సంపాదించుకుంది. అయితే, ఆ తర్వాత పలు సమస్యల కారణంగా రెండుసార్లు మూతపడింది. ఇప్పుడు ఈ తాజాఘటనతో రోలర్‌కోస్టర్‌ను కొద్దిరోజులపాటు మూసివేస్తున్నట్టు ప్రకటించారు. .
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com