Russia: ప్రేమాదోమా వద్దన్నందుకు... కిరాయి హంతకుడితో అమ్మనే...

Russia: ప్రేమాదోమా వద్దన్నందుకు... కిరాయి హంతకుడితో అమ్మనే...
కిరాయి హంతకుడికి డబ్బులిచ్చి.. సొంత తల్లిని కడతేర్చిన 14ఏళ్ల చిన్నారి...

ఒంటిరిగా సమాజంతో పోరాడుతూ కూతురుకి బంగారు భవిష్యత్తు అందించాలన్న ఆమె తపనకు కన్న కూతురే అడ్డుతగిలింది. అమ్మ కలలు కన్న తన అందాల ప్రపంచాన్ని తానే స్వయంగా చిన్నాభిన్నం చేసుకుంది. స్నేహితుడికి దూరంగా ఉండాలని హితువు పలికినందుకు కిరాయి హంతకుడికి సుపారీ ఇచ్చి మరీ అమ్మను కడతేర్చింది. ఈ ఘటన రష్యాలోని మాస్కోలో చోటుచేసుకుంది.

మాస్కోలో ఎస్టేట్ ఏజెంట్ గా పనిచేస్తున్న అనస్టేసియా(38) సింగిల్ మదర్ గా కూతురుని కంటికి రెప్పలా సాకుతోంది. ఈ క్రమంలో ఇటీవలే వారింటిలో మరో అబ్బాయి చేరాడు. సదరు అబ్బాయి బాలిక బాయ్ ఫ్రెండ్ అని తెలుస్తోంది. కొన్ని రోజులు అంతా బాగానే ఉంటున్నప్పటికీ తాను ఇంట్లో లేని సమయంలో ఇతర స్నేహితులను పిలిచి పార్టీలు చేసుకోవడం, విచ్చల విడితనానికి కూతురు అలవాటు పడుతోందని గ్రహించిన అనస్టేసియా సదరు కుర్రాడిని ఇంటి నుంచి వెళ్లిపోవాల్సిందిగా ఆదేశించింది. ఈ క్రమంలోనే తల్లిపై కోపాన్ని పెంచుకున్న బాలిక, స్నేహితుడితో కలసి ఓ కిరాయి హంతకుడికి సుపారీ ఇచ్చింది. భారత కరెన్సీలో సుమారు రూ.3,72,202 ఇచ్చి తల్లిని చంపేందుకు పురమాయించింది. ఆ రోజు విధులు ముగించుకుని ఇంటికి తిరిగి వచ్చిన అనస్టేసియా, ఇంటిలోకి అడుగుపెట్టగానే ఆమెపై దాడి జరిగినట్లు తెలుస్తోంది. అనంతరం తమ ప్రాంతానికి కొద్ది దూరంలోని డంప్ యార్డ్ లో అనస్టేసియా శవాన్ని పారేయగా, పోలీసులు ఆమె మృతదేశాన్ని గుర్తించారు. ఆమెను తీవ్రంగా హింసించి తరువాత మెడ నులిమి చంపినట్లు పోస్ట్ మార్టమ్ నివేదికలో తేలింది. కన్న కూతురే ఇంతటి ఘాతుకానికి తెగబడటం స్థానికంగా కలకలం సృష్టిస్తోంది. చిన్నారి తన తల్లిని ఎంతగా ద్వేషిస్తున్నదీ పలు మార్లు స్నేహితుల దగ్గర చెప్పినట్లు తెలుస్తోంది. కానీ, అనస్టేసియా మాత్రం కూతురి భవిష్యత్తు కోసం తపించిన వైనాన్ని ఇరుగు పొరుగు గుర్తుచేసుకుని కన్నీటి పర్యంతం అవుతున్నారు.



Tags

Read MoreRead Less
Next Story