Russia: అర్జెంటీనాకు బారులు తీరిన గర్భవతులు....
ఉక్రెయిన్-రష్యా యుద్ధం నేపథ్యంలో అగ్రదేశంలో వలసలు ఊపందుకున్నాయి. అయితే రష్యా నుంచి జనాలు వలసెందుకు పోతున్నారన్నది చర్చనీయాంశంగా మారింది. అందులోనూ ప్రత్యేకించి గర్భిణులు అర్జెంటీనాకు వలస పోతున్నారని తెలుస్తోంది. గర్భిణులు మాత్రమే వలస వెళ్లడానికి ప్రత్యేక కారణం ఏమై ఉంటుంది. తెలుసుకుందాం.. అదే బర్త్ టూరిజమ్. అర్జెంటీనాలో తమ పిల్లలకు జన్మనివ్వడం ద్వారా వారికి ఆ దేశ పౌరసత్వం లభిస్తుందని వారు ఈ వలసలకు ఉపక్రమిస్తున్నారని అధికారులు చెబుతున్నారు. దీంతో అర్జెంటీనాలో బర్త్ టూరిజం అమాంతం రెండింతలు పెరిగిందనే చెప్పాలి. ఉక్రెయిన్ లోకి రష్యా దళాలు చొచ్చుకెళ్లిన నాటి నుంచే రష్యా గర్భిణులు అర్జెంటీనా రాజధాని బ్యూనోస్ ఎరీస్ కు వలస వెళ్లడం మొదలుపెట్టారు. క్రమంగా వీరి సంఖ్య 5వేలకు చేరుకుంది. మొన్న ఒక్కరోజే సుమారు 31 మంది గర్భిణులు ఒకే ఫ్లైట్ లో మూకుమ్మడిగా అర్జెంటీనా చేరుకోవడం సంచలనంగా మారింది. దీంతో ఆ దేశం తమ వీసా నిబంధనలను మరింత క్లిష్టతరం చేసేందుకు సిద్ధమైంది. వీరిలో సగం మందికి పైగా నెలలు నిండుతుండగా, కొంతమందిని తమ దేశానికి తిరిగి పంపే ఏర్పాట్లు చేస్తున్నారు. తమ పిల్లలకు అర్జెంటీనా పౌరసత్వం లభిస్తుందన్నదే ఈ వలసల వెనుక ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తోంది. చిన్నారులకు ద్వంద పౌరసత్వం పొందడం ద్వారా భవిష్యత్తులో ఇరు దేశాల మధ్య రాకపోకలకు అంతరాయం ఉండదన్న భావన ప్రజల్లో ఉంది. గతేడాది సుమారు 10,500 మంది గర్భిణిలు అర్జెంటీనాకు వచ్చినట్లు ఆ దేశ ఇమిగ్రేషన్ కార్యాలయం వెల్లడించింది. ఇప్పటికే 7వేల మంది ఇదే విధంగా పురుడుపోసుకుని తమ స్వదేశాలకు తిరిగి వెళ్లిపోయారని అధికారులు తెలిపారు. వీసా తదితల బాధ్యతలను స్థానికంగా లాయర్లకు విడిచిపెట్టి వెళ్లారని తెలిసింది. రష్యా కన్నా అర్జెంటీనా పౌరులకే ఎక్కువ స్వేచ్ఛ ఉందని రష్యా మహిళలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. తమ చిన్నారులకు అర్జెంటీన్ పౌరసత్వం లభిస్తే తమకు సైతం పేరెంటల్ సిటిజన్ షిప్ లభిస్తుందన్నది మరో వెసులుబాటు. అంతేకాదు అర్జెంటీనా పౌరులు విసా లేకుండా 87 దేశాలు వెళ్లే వెసులు బాటు ఉంది. మరోవైపు ఉక్రెయిన్ పై యుద్ధం ప్రకటించిన నాటి నుంచి ఎన్నో పశ్చిమ దేశాలు రష్యా వాసులకు వీసా ఇవ్వడం మానేశాయి. మరి కొన్ని దేశాలు వీసాల జారీని క్లిష్టతరం చేశాయి. దీని వల్లే అర్జెంటీనా బర్త్ టూరిజానికి గిరాకీ పెరిగినట్లు తెలుస్తోంది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com