Russia : మరో సారి పుతిన్ ఆరోగ్యంపై వదంతులు

ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్య ప్రారంభించినప్పటి నుంచి అధ్యక్షుడు పుతిన్ ఆరోగ్యంపై అనేక సార్లు వదంతులు వచ్చాయి. తాజాగా మరోసారి ఆయన ఆరోగ్యంపై చర్చ మొదలైంది. పుతిన్ మరోసారి అనారోగ్యం పాలైనట్లు ప్రచారం జరుగుతోంది. విపరీతమైన తలనొప్పి, కంటిచూపు మసకబారడం వంటి లక్షణాలతో బాధపడుతున్నారట. ఈ లక్షణాలపై డాక్టర్లు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారని జనరల్ ఎస్‌వీఆర్ అనే టెలిగ్రామ్ ఛానెల్ ఓ కథనాన్ని ప్రచురించినట్ల వార్త అంతర్జాతీయ వార్త సంస్థలు చెబుతున్నాయి. గత కొంత కాలంగా ఈ టెలిగ్రామ్ ఛానెల్ పుతిన్ ఆరోగ్యానికి సంబంధించి అనేక కథనాలను బహిర్గతం చేస్తోంది. ప్రస్తుతం పుతిన్ కుడి చేయి, కాలుకు స్పర్శ కోల్పోవడంతో ఆయనకు వైద్యులు అత్యవసర చికిత్స అందించినట్లు వెల్లడించింది. కొన్ని రోజులపాలు ఆయనకు విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించినట్లు తెలిపింది. అయితే, పుతిన్ విశ్రాంతి తీసుకునేందుకు నిరాకరించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని.. బంధువులు, కుటుంబసభ్యులు పుతిన్ ఆరోగ్యంపై ఆందోళనగా ఉన్నట్లు తెలిపింది.
ఉక్రెయిన్‌తో యుద్ధంలో పైచేయి సాధించాలని పుతిన్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. యుద్ధం గురించి ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ తీరిక లేకుండా గడుపుతున్నారట. దీంతో ఆయన తరచూ అనారోగ్యానికి గురవుతున్నారని తెలుస్తోంది. గతంలో కూడా ఆయన చేతులు రంగులు మారాయని, క్యాన్సర్ బారిన పడ్డారని, పార్కిన్సన్స్‌తో బాధపడుతున్నారని వార్తలు వెలువడ్డాయి. ఈ వార్తలకు ఆయన క్రిమియా సందర్శన, రష్యా సైనికుల కుటుంబ సభ్యులతో సమావేశం, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో సమావేశం వంటి వాటి ద్వారా చెక్ పెట్టారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com