RUSSIA: మీ విధేయులం, దేశభక్తులం: వాగ్నర్ గ్రూప్
రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్, వాగ్నర్ గ్రూప్ అధినేత ప్రిగోజిన్‌తో జరిగిన భేటీలో కీలకమైన చర్చ జరిగిందని క్రెమ్లిన్ వెల్లడించింది. అధికారిక వీడియోను విడుదల చేసింది. ఉక్రెయిన్‌తో జరుగుతున్న యుద్ధం వాగ్నర్ గ్రూప్ భవిష్యత్తు ప్రణాళికలు సహా జూన్ 24 నాటి తిరుగుబాటుకు గల కారణాలను ప్రిగోజిన్... అధ్యక్షుడు పుతిన్‌కు వివరించారు. మాస్కోపై తాము తిరుగుబాటు చేయలేదని, తమ డిమాండ్లను వినిపించేందుకు ప్రయత్నం మాత్రం చేసినట్లు ప్రిగోజిన్ వివరించినట్లు మాస్కో వెల్లడించింది. తాము పుతిన్‌కు బలమైన మద్దతుదారులమని, నిబద్దత కలిగిన దేశభక్తులమని కమాండర్లు చెప్పినట్లు తెలిసింది. మాతృభూమి కోసం పోరాటం కొనసాగించడానికి సిద్ధంగా ఉన్నామని కూడా వివరించారు. కమాండర్ల వివరణను సావధానంగా విన్న పుతిన్.. భవిష్యత్తులో జరిగే పోరాటానికి సంబంధించి వారికి దిశా నిర్దేశం చేసినట్లు క్రెమ్లిన్ అధికారిక వర్గాలు తెలిపాయి.
ప్రిగోజిన్‌తో పుతిన్ భేటీ కావడంపై అమెరికా మండిపడింది. వాగ్నర్ గ్రూప్ బాస్ ప్రిగోజిన్ ఓడిపోవడాన్ని రష్యా అధ్యక్షుడు భరించలేడని అమెరికా మాజీ లెప్టినెంట్ జనరల్ మార్క్ అన్నారు. రష్యా ప్రపంచ శక్తికి ప్రిగోజిన్ చాలా కీలకమని, తిరుగుబాటు చేసినా అతన్ని మాస్కోధీశుడు జైల్లో పెట్టలేడని స్పష్టం చేశారు. వాగ్నర్ గ్రూప్ అధినేత దేశ ద్రోహం చేశాడని, అతడిని జైల్లో పెడతానని ప్రగల్భాలు పలికిన పుతిన్, ఇప్పుడు ఎందుకు స్నేహ హస్తం చాస్తున్నాడని ప్రశ్నించారు. రష్యా ప్రభుత్వానికి సహాయం చేసే వాగ్నర్ గ్రూప్ సభ్యులు అనేక దేశాల్లో ఉన్నారని మార్క్ గుర్తు చేశాడు.
తిరుగుబాటును విరమించిన ప్రిగోజిన్‌ను వాగ్నర్ గ్రూప్‌లోని కొందరు యోధులు దేశద్రోహిగా చూస్తున్నారని రష్యాకు చెందిన హక్కుల కార్యకర్త ఒకరు అనడం కలకలం రేపుతోంది. రష్యన్ సైన్యానికి మరోసారి మద్దతు ప్రకటించిన ప్రిగోజిన్‌పై ఆయన మద్దతుదారులే వ్యతిరేకంగా ఉన్నారని, వ్యక్తిగత లాభం కోసమే అతడు ఈ నిర్ణయం తీసుకున్నారని ఆగ్రహం ఉన్నట్లు మాస్కో టైమ్స్ వెల్లడించింది. వాగ్నర్ గ్రూప్‌లో ఉన్న లుకలుకలు భవిష్యత్తులో బయటపడి మరో తిరుగుబాటుకు దారి తీసే అవకాశాన్ని కొట్టిపారేయలేమని హెచ్చరించారు.
ఉక్రెయిన్‌పై యుద్ధం చేస్తున్న ‘వాగ్నర్ గ్రూపు’.. తిరుగుబాటు ప్రయత్నంలో భాగంగా రొస్తోవ్-ఆన్-డాన్ నగరంలోని రష్యా సైనిక కార్యాలయాన్ని ఆధీనంలోకి తీసుకుంది. తాము చేస్తున్నది న్యాయం కోసం పోరాటమేనని, తిరుగుబాటు కాదని ప్రిగోజిన్ అప్పట్లో పేర్కొన్నారు. మాస్కోలోని సైనిక నాయకత్వాన్ని కూలదోసేందుకు అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. చివరకు వెనక్కి తగ్గిన వాగ్నర్ చీఫ్.. రక్తపాతం లేకుండా చేయడానికి తమ దళాలను వెనక్కు తీసుకునేందుకు అంగీకరించినట్లు ప్రకటించడంతో తిరుగుబాటు యత్నానికి బ్రేక్ పడింది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com