Russia Earthquake: రష్యాలో 8.8 తీవ్రతతో భారీ భూకంపం

రష్యాను అత్యంత ప్రమాదకరమైన భూకంపం హడలెత్తించింది. 8.8 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. కమ్చట్కా ద్వీపకల్పంలో 8.8 తీవ్రతతో శక్తివంతమైన భూకంపం సంభవించింది. దీంతో సునామీ హెచ్చరికలను అధికారులు జారీ చేశారు. ఒక్కసారిగా భవనాలన్నీ కంపించిపోయాయి. ఇందుకు సంబంధించిన షాకింగ్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
రష్యాలోని ఫార్ ఈస్టర్న్ కమ్చట్కా ద్వీపకల్పంలో బుధవారం తెల్లవారుజామున 8.8 తీవ్రతతో భూకంపం సంభవించగానే అధికారులు అప్రమత్తమయ్యారు. వెంటనే సునామీ హెచ్చరికలు జారీ చేశారు. ఇక అలలు 4 మీటర్లు (13 అడుగులు) ఎత్తుకు ఎగురుతాయని తెలిపారు. సమీప ప్రాంత ప్రజలు ఖాళీ చేసి వెళ్లిపోవాలని హెచ్చరికలు జారీ చేశారు. అయితే ప్రాణనష్టం గురించి మాత్రం ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. అయితే భవనాలకు మాత్రం భారీగా నష్టం వాటిల్లిందని అధికారులు తెలిపారు.
అమెరికా సునామీ హెచ్చరిక కేంద్రం ప్రకారం.. రష్యా, హవాయి, ఈక్వెడార్ వరకు కూడా 3 మీటర్ల ఎత్తులో అలలు ఎగిసిపడే అవకాశం ఉందని తెలిపింది. భూకంపం 19.3 కి.మీ (12 మైళ్ళు) లోతులో ఏర్పడింది. రష్యాలోని కమ్చట్కా ద్వీపకల్పంలోని పెట్రోపావ్లోవ్స్క్‌కు తూర్పు-ఆగ్నేయంగా 125 కి.మీ (80 మైళ్ళు) దూరంలో అవాచా బే తీరం వెంబడి కేంద్రీకృతమై ఉందని అమెరికా తెలిపింది. ఇక రష్యాతో పాటు అమెరికా, జపాన్‌లకు సునామీ హెచ్చరికలను అధికారులు జారీ చేశారు. అలాస్కాతో సహా అనేక ప్రాంతాలకు హెచ్చరికలు జారీ అయ్యాయి. ఇక ప్రకంపనలకు భవనాలు కంపించాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com