RUSSIA: అణు ఒప్పందం నుంచి బయటకి రష్యా
ఉక్రెయిన్ విషయంలో పశ్చిమ దేశాలు అనుసరిస్తున్న వైఖరిపై గుర్రుగా ఉన్న రష్యా అధ్యక్షుడు పుతిన్ అణు పరీక్షల నిషేధ ఒప్పందం నుంచి బయటికి వస్తామని ఇటీవలే హెచ్చరించారు. ఆ వ్యాఖ్యలకు అనుగుణంగానే రష్యా దిగువ సభ అయిన స్టేట్ డ్యూమాలో సమగ్ర అణు పరీక్షల నిషేధ ఒప్పందం నుంచి రష్యా వైదొలిగేందుకు ఉద్దేశించిన బిల్లును ప్రవేశపెట్టారు. తాజాగా ఆ బిల్లుకు దిగువ సభలో తుది ఆమోదం లభించింది. ఈ ఒప్పందంపై అమెరికా కూడా సంతకం చేసినప్పటికీ ఆ దేశ చట్ట సభలు దాన్ని ఆమోదించలేదు. ఇదే విషయాన్ని గుర్తు చేస్తూ తాము అణు పరీక్షల నిషేధ ఒప్పందం నుంచి బయటకు వస్తామని పుతిన్ హెచ్చరించారు. అందుకు అనుగుణంగానే రష్యా దిగువ సభ ఈ బిల్లుకు ఆమోదం తెలిపింది. ఈ ఒప్పందం నుంచి వైదొలిగితే రష్యా మళ్లీ అణు పరీక్షలు చేపట్టే అవకాశం ఉంది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా భయాందోళనలు నెలకొన్నాయి. సభ్యులంతా ఏకగ్రీవంగా బిల్లుకు మద్దతు తెలుపుతూ ఓటు వేశారు. అనంతరం ఈ బిల్లు ఎగువ సభ అయిన ఫెడరేషన్ కౌన్సిల్‌కు వెళ్లనుంది. అక్కడ ఓటింగ్ వచ్చే వారం జరిగే అవకాశం ఉంది. అయితే ఈ బిల్లుకు ఏకగ్రీవంగా మద్దతు తెలుపుతామని ఇప్పటికే ఫెడరేషన్ కౌన్సిల్ సభ్యులు స్పష్టం చేశారు.
అణ్వాయుధ పరీక్షలను నిషేధించే అంతర్జాతీయ ఒప్పందాన్ని ఆమోదిస్తూ 2000 సంవత్సరంలో చేసిన తీర్మానాన్ని తమ పార్లమెంటు రద్దు చేసే అవకాశాలు ఉన్నాయంటూ పుతిన్ ఈనెల ప్రారంభంలోనే తెలిపారు. అణ్వస్త్ర పరీక్షల నిషేధ ఒప్పందంపై అగ్రరాజ్యం అమెరికా సంతకం చేసినప్పటికీ ఆ దేశ చట్ట సభలు ఇప్పటికీ ఆమోదించని సంగతిని ప్రస్తావించిన పుతిన్ తాము ఆ తరహాలోనే నిర్ణయం తీసుకుంటున్నామని చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా అణు పరీక్షలపై నిషేధం విధిస్తూ 1996లో సమగ్ర అణు పరీక్షల నిషేధ ఒప్పందాన్ని తీసుకొచ్చారు. అయితే ఇది పూర్తిగా అమల్లోకి రాలేదు.
అమెరికాతో పాటు చైనా, భారత్, ఉత్తర కొరియా, ఇరాన్, ఇజ్రాయెల్, ఈజిప్టు దేశాల చట్ట సభలు కూడా ఈ ఒప్పందాన్ని ఆమోదించ లేదు. ఉక్రెయిన్‌కు సైనిక మద్దతును అందించకుండా పశ్చిమ దేశాలను నిరోధించేందుకు రష్యా అణు పరీక్షలను పునఃప్రారంభించవచ్చనే ఆందోళనలు నెలకొన్నాయి. అణు పరీక్షలను మళ్లీ నిర్వహించాలని కొంతమంది నిపుణులు చెప్పినప్పటికీ , ఈ అంశంపై తాను ఇంకా ఎలాంటి అభిప్రాయాన్ని ఏర్పరచుకోలేదని పుతిన్ చెప్పారు. అణు పరీక్షల నిషేధాన్ని గౌరవిస్తామని గత వారం రష్యా డిప్యూటీ విదేశాంగ మంత్రి తెలిపారు. అయితే అమెరికా అణు పరీక్షలను చేపడితే తాము వెనకాడమని స్పష్టం చేశారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com