రష్యాలో ఘనంగా నమస్తే మాస్కో 2023

రష్యాలో ఘనంగా నమస్తే మాస్కో 2023
వైభవంగా నమస్తే మాస్కో ఫెస్టివల్‌-2023.... భారత సంస్కృతి, సాంప్రదాయాలను చాటిచెప్పిన వేడుక... హస్తకళ స్టాళ్లు చూసి ఆశ్చర్యపోయిన రష్యన్‌ యువత

రష్యా రాజధాని మాస్కోలో నమస్తే మాస్కో ఫెస్టివల్‌-2023ను ఘనంగా నిర్వహించారు. మాస్కోలోని భారత రాయబారి కార్యాలయంలో జరిగిన వేడుకల్లో భారీగా ప్రజలు పాల్గొన్నారు. నాలుగేళ్ల విరామం తర్వాత తిరిగి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇండియన్‌ వుమెన్స్‌ అసోసియేషన్-IWA, భారత దౌత్య కార్యాలయం ఆధ్వర్యంలో వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ఈ ఫెస్టివల్లో ఏర్పాటు చేసిన ఇండియన్‌ స్టాళ్లు ఆకట్టుకున్నాయి. భారతీయ సంస్కృతి, సంప్రదాయలను రష్యాకు చాటి చెప్పాలనే ఉద్దేశంతో ఈ వేడుకను జరిపినట్లు నిర్వాహకులు తెలిపారు.


నమస్తే మాస్కో ఫెస్టివల్‌-2023 వేడుకల్లో ఏర్పాటు చేసిన పలు కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. భారతీయ నృత్యాలు, సంగీత కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. తమ చేతులపై వివిధ రకాల మెహందీ డిజైన్లు వేసుకొని రష్యన్‌ యువత మురిసిపోయారు. చేనేత వస్త్రాలు, హస్తకళల స్టాళ్లు సందర్శకులను మంత్ర ముగ్దుల్ని చేశాయి. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన షాపింగ్‌ విలేజ్‌ ఔత్సహికులతో కళకళలాడింది.

భారతీయ దుస్తులు, ఆభరణాలను కొనుగోలు చేసేందుకు సందర్శకులు ఆసక్తి కనబరిచారు. సుగంధ ద్రవ్యాలు, ఆర్గానిక్ సౌందర్య సాధనాలు, తోలు బూట్లు హ్యాండ్‌బ్యాగులు, హస్త కళలు ఆకట్టుకున్నాయి. ప్రసిద్ధ భారతీయ వంటకాలను రుచి చూసేందుకు రష్యన్లు ఎగబడ్డారు. భారత్‌లోని దక్షిణాది నుంచి ఉత్తరాది రాష్ట్రాల వరకు ప్రసద్ధి చెందిన అన్ని రకాలు వంటకాలను ఏర్పాటు చేశారు. ఈ వేడుకల్లో యోగా తరగతులను కూడా ఏర్పాటు చేశారు. ప్రసిద్ధ భారతీయ వంటకాలు, స్వీట్ల రుచికి రష్యన్లు ఫిదా అయిపోయారు.


భారత్‌ రష్యా మధ్య ఉన్న సంబంధాల బలోపేతానికి ఈ కార్యక్రమం ఎంతో దోహదం చేస్తుందని ఇరు దేశాలు ఓ ప్రకటనలో పేర్కొన్నాయి. నమస్తే మాస్కో కార్యక్రమం ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంలో కీలక పాత్ర పోషిస్తుందని రష్యాలోని భారత రాయబారి పవన్ కపూర్ తెలిపారు. రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం నేపథ్యంలో నమస్తే మాస్కో కార్యక్రమాన్ని గత నాలుగేళ్లుగా నిర్వహించలేదు. ఉద్రిక్త పరిస్థితులు... మాస్కోలో యుద్ధానికి వ్యతిరేకంగా నిరసనలు.... ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ కార్యక్రమాల వల్ల నమస్తే మాస్కోను నిర్వహించలేదని రష్యా అధికారి ఒకరు వెల్లడించారు. ఈ ఏడాది నుంచి మళ్లీ ప్రతి ఏటా నిర్వహించాలని ఇరుదేశాలు నిర్ణయం తీసుకున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story