Russia: వినాశకర అణు క్షిపణులను బయటికి తీసిన రష్యా
రష్యా అడ్వాన్స్డ్ ఖండాంతర బాలిస్టిక్ క్షిపణులను మోహరించిందని రోస్కోస్మోస్ స్పేస్ ఏజెన్సీ చీఫ్ యూరి బోరిసోవ్ ప్రకటించారు. తమ శత్రువులు ఏదైనా దుస్సాహసానికి పాల్పడాలంటే రెండు సార్లు ఆలోచించుకోవాల్సి వచ్చేలా చేస్తామని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ గతంలో హెచ్చరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే రష్యా అత్యంత అణ్వాయుధ సామర్థ్యమున్న సర్మత్ క్షిపణులను మోహరించింది. పూర్తి యుద్ధ సన్నద్ధతతో వీటిని మోహరించినట్లు అధికారులు తెలిపారు.
రష్యాలో ఉన్న అడ్వాన్స్డ్ ఆయుధాలలో సర్మత్ ఒకటి. ఈ క్షిపణి సామర్థ్యం గురించి తెలిసిన వాళ్లకు పుతిన్ ఎందుకు అంత ధీమాగా ఈ మాటలు అన్నాడో అర్థమవుతుంది. ప్రపంచంలోనే అత్యంత వినాశకర అణు క్షిపణిగా ఆర్ఎస్-28 సర్మాత్ లేక సాతాన్-2 క్షిపణికి పేరుంది. ఇది ఖండాంతర బాలిస్టిక్ శ్రేణికి చెందినది. ఈ ఒక్క మిస్సైల్ కు 15 వార్ హెడ్లు అమర్చే అవకాశం ఉంది. అందుకే ఇది సృష్టించే విధ్వంసం ఊహకందనిది. గరిష్ఠంగా గంటకు 12 వేల మైళ్ల వేగంతో దూసుకుపోతుంది. అంటే యూరప్ లోని ఏ భాగానికైనా 3 నిమిషాల్లోపే చేరుకుంటుంది. ఇది 116 మీటర్ల పొడవు, 220 టన్నుల బరువుతో భీకరంగా ఉండే ఈ మిస్సైల్ రేంజ్ 11,180 మైళ్లు అని అంచనా.
అనేక న్యూక్లియర్ ఆయుధాలను వాడుతూ శత్రువులపై అది దాడి చేయగలదు. తమ దేశాన్ని బెదిరించే ప్రయత్నాలు చేసేవారికి, తమ గురించి దురుసుగా మాట్లాడేవారు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాలని పుతిన్ గతంలో చెప్పారు. రష్యాను సర్మత్ సురక్షితంగా ఉంచడానికి తోడ్పడుతుందని గుర్తుచేశారు. ఉక్రెయిన్ తో యుద్ధం చేస్తున్న రష్యాకు మొదటి నుంచి ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. అయినప్పటికీ వెనక్కుతగ్గడం లేదు. ఇప్పుడు ఉన్నట్టుండి రష్యా శత్రు భయంకర సాతాన్-2 క్షిపణులను మోహరించడం తీవ్ర కలకలం రేపుతోంది. గతంలో పుతిన్ వ్యాఖ్యల నేపథ్యంలో ఈ పరిణామం పాశ్చాత్య దేశాలను కలవరపాటుకు గురిచేస్తోంది. ఉక్రెయిన్ పై రష్యా దాడులు కొనసాగుతున్న నేపథ్యంలో యూరప్ లో ఉద్రిక్తతలు నెలకొని ఉండగా, ఇప్పుడు పుతిన్ సేనలు అణు క్షిపణులను కీలక స్థానాల్లో మోహరించడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
గతేడాది ఫిబ్రవరి చివరి వారంలో ఉక్రెయిన్ పై రష్యా సైనిక చర్య ప్రారంభించింది. ఏడాదిన్నర గడిచినా ఉక్రెయిన్ లొంగింది లేదు. కానీ ఇప్పుడు భయానక అస్త్రం సర్మాత్ మిస్సైళ్లను రష్యా బయటికి తీయడం చూస్తుంటే, ఏదో జరగబోతోందన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. మాతృదేశాన్ని కాపాడుకోవడానికి 'అన్ని అవకాశాలు' ఉపయోగించుకుంటాం అని పుతిన్ ఇటీవల జాతీయ టెలివిజన్ లో ప్రసంగించారు. ఈ చర్యతో అన్ని అవకాశాలు అంటే పుతిన్ దృష్టిలో అణ్వస్త్రాలేనని రక్షణ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com