Ukraine: డ్రోన్ దాడులతో రెచ్చిపోతున్న ఉక్రెయిన్

ఇప్పటివరకు జరిగిన యుద్ధంలో తన భూభాగాన్ని కాపాడుకునేందుకు శ్రమించిన ఉక్రెయిన్, ఇప్పుడు రెచ్చిపోయి ప్రతిదాడులకు దిగింది. రష్యాకు నిద్ర లేకుండా చేస్తోంది. జెలెన్ స్కీ బలగాలు సరిహద్దు నుంచి వందల కిలోమీటర్ల దూరం ప్రయాణించి. మాస్కో నగరంపై డ్రోన్ దాడులు చేస్తున్నాయి. అలాగే రష్యా ఆక్రమిత క్రిమియా ద్వీపం పై కూడా గురిపెట్టాయి. ఒకేసారి 20 డ్రోన్లు క్రిమియాపై దాడి చేశాయి అయితే రష్యా వాటిలో 14 డ్రోన్ లను కూల్చివేసింది. మిగిలిన వాటిని స్తంభింప చేసినట్టుగా పేర్కొంది.
రష్యా ప్రధాన భూభాగాన్ని లక్ష్యంగా చేసుకుని ఉక్రెయిన్ చేస్తున్న డ్రోన్ దాడులతో పుతిన్ ప్రభుత్వం ఆందోళన చెందుతోంది. నేరుగా పుతిన్ అధ్యక్ష భవనంపై ఉక్రెయిన్ డ్రోన్ దాడులు చేయడం ప్రపంచాన్నే నివ్వెరపరిచింది. అంతేనా మాస్కో ప్రధాన విమానాశ్రయం, కెర్చ్ వంతెన, ఆయుధ పరిశ్రమలు, భవనాలపై జెలెన్ స్కీ సేనలు డ్రోన్ దాడులు చేశాయి. కొన్ని దాడులు తామే చేశామని అంగీకరించిన ఉక్రెయిన్. మరి కొన్ని దాడులు తాము చేయలేదని ప్రకటించింది. అయితే వీటన్నింటినీ ఉగ్రవాద చర్యగా అభివర్ణించిన రష్యా ప్రతికార దాడులకు దిగింది. అయితే ఉక్రెయిన్ డ్రోన్ దాడుల తీవ్రత పెరుగుతుండడంతో మాస్కో బలగాలు రక్షణ చర్యలకు ఉపక్రమించాయి.
ఉక్రెయిన్ ఎడతెరిపి లేకుండా చేస్తున్న డ్రోన్ దాడులతో మాస్కోలోని రెండు విమానాశ్రయాలను కొద్దిసేపు మూసివేశారు. వ్నుకోవ్ విమానాశ్రయ పరిసరాల్లో అనుమానాస్పద డ్రోన్ల కదలికలను గుర్తించడంతో డిపార్చర్స్, అరైవల్స్‌లను సస్పెండ్ చేశారు. వ్నుకోవ్‌కు 150 కిలోమీటర్ల దూరంలోని కల్గా ఎయిర్ పోర్టును కూడా కొద్ది సేపు మూసివేశారు. అనంతరం కొద్దసేపటికి రష్యా రక్షణ శాఖ ఓ డ్రోన్‌ను కూల్చివేసినట్లు ప్రకటించింది. కాసేపటికే ఈ రెండు విమానాశ్రాలను తిరిగి తెరిచారు. విమానాశ్రయంపై దాడి చేయడానికి కీవ్ చేస్తున్న యత్నాలను భగ్నం చేస్తున్నట్లు ప్రకటించిన రష్యా బలగాలు ఆస్తి, ప్రాణ నష్టాలు సంభవించకుండా రక్షణ చర్యలు తీసుకుంటున్నట్లు ప్రకటించాయి.
ఉక్రెయిన్ అమ్ములపొదిలోని బోట్ డ్రోన్‌లే తమ భూభాగంలో దాడులకు పాల్పడుతున్నట్లు రష్యా ఆరోపిస్తోంది. 60 గంటలపాటు 400 కిలోమీటర్ల దూరం ప్రయాణించే సామర్థ్యం కలిగిన ఈ డ్రోన్లు ఉక్రెయిన్ సరిహద్దు నుంచి రష్యాలోకి చొరబడి విధ్వంసం సృష్టిస్తున్నాయి. ఈ బోటు డ్రోన్లు రష్యా దళాలకు నిద్రలేకుండా చేస్తున్నాయి. 200 కిలోల పేలుడు పదార్థాలను మోయగల ఈ డ్రోన్లు, గంటకు గరిష్టంగా 80 కిలో మీటర్ల వేగంతో దూసుకెళ్లగలవని తెలుస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com