Russia-Ukraine War: రష్యా భూభాగంలోకి ఉక్రెయిన్ బలగాలు
ఉక్రెయిన్ బలగాలు సరిహద్దు దాటి తమ భూభాగంలోకి వచ్చాయని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆరోపించారు. ఉక్రెయిన్ మిస్సైళ్లు సహా వేర్వేరు ఆయుధాలతో నివాస భవనాలు, ఆంబులెన్సులపై దాడికి పాల్పడుతున్నట్టు ఆయన పేర్కొన్నారు. కర్స్ ప్రాంతంలోకి ఉక్రెయిన్ సైన్య ప్రవేశించినట్టు రష్యా రక్షణ శాఖ సైతం ఆరోపించింది. రెండేళ్లుగా ఇరు దేశాల మధ్య సాగుతున్న యుద్ధంలో ఉక్రెయిన్ తమ భూభాగంలోకి ప్రవేశించిందని రష్యా ఆరోపించడం ఇదే మొదటిసారి. సడ్ఝా పట్టణం వద్ద ఒకేసారి ఉపరితలం, వాయు మార్గాల్లో ఉక్రెయిన్ దాడికి పాల్పడినట్టు రష్యా అధికారవర్గాలు చెప్తున్నాయి. అయితే, ఇంకా రష్యా భూభాగంలోనే ఉక్రెయిన్ సైన్యం ఉందా అనే అంశంపై ఎలాంటి ప్రకటన చేయలేదు. కాగా, ఉక్రెయిన్ కూడా ఈ విషయంపై స్పందించలేదు.
ఉక్రెయిన్ బలగాలు తమ భూభాగంలోకి ప్రవేశించినట్లు రష్యా ఆరోపించింది. దీంతో కుర్క్స్ ప్రాంతంలో ఆత్యయిక స్థితి విధించినట్లు ఆ ప్రాంత గవర్నర్ అలెక్సీ స్మిర్నోవ్ ప్రకటించారు. శత్రు సైనికులను తరిమికొట్టడం కోసమే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని వ్యాఖ్యానించారు. ఉక్రెయిన్ చర్యలు రెచ్చగొట్టేలా ఉన్నాయని అధ్యక్షుడు పుతిన్ అధికారులతో నిర్వహించిన సమావేశంలో తెలిపారు. జనావాసాలపైకి విచక్షణారహితంగా కాల్పులు జరుపుతున్నారని ఆరోపించారు.
రష్యా సేనలు ఉక్రెయిన్ బలగాలతో భీకర పోరు కొనసాగిస్తున్నట్లు మాస్కో తెలిపింది. ఇప్పటి వరకు ఐదుగురు సామాన్య పౌరులు మరణించినట్లు పేర్కొంది. మరో 31 మంది తీవ్రంగా గాయపడ్డట్లు తెలిపింది. వీరిలో ఆరుగురు చిన్నారులు ఉన్నట్లు వెల్లడించింది. దీనిపై ఇప్పటి వరకు ఉక్రెయిన్ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
మంగళవారం సాయంత్రం దాదాపు 1000 మంది ఉక్రెయిన్ సైనికులు, 11 యుద్ధ ట్యాంకులు, 20 సాయుధ వాహనాలు సుడ్జా పట్టణంలోకి ప్రవేశించినట్లు మాస్కో తెలిపింది. దీంతో పరిసర ప్రాంతాల్లోని గ్రామాల్లో రష్యా సైనికులు వారితో పోరాడుతున్నట్లు పేర్కొంది. ప్రజలు ఎవరూ బయటకు రావొద్దని ఆదేశాలు జారీ చేసినట్లు వెల్లడించింది. యుద్ధ విమానాలను సైతం రంగంలోకి దించింది. ముందస్తు జాగ్రత్తగా ప్రమాదరక ప్రాంతాల నుంచి ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలించింది.
2022 ఫిబ్రవరిలో రష్యా - ఉక్రెయిన్ మధ్య యుద్ధం ప్రారంభమైన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఈ స్థాయిలో ఉక్రెయిన్ బలగాలు రష్యా భూభాగంలోకి ప్రవేశించడం ఇదే తొలిసారి. సుడ్జా గ్యాస్ కేంద్రాన్ని ఉక్రెయిన్ బలగాలు తమ నియంత్రణలోకి తీసుకున్నట్లు ఆ దేశ ఎంపీ ఓలెక్సియ్ హోన్‌చరెంకో బుధవారం సాయంత్రం ప్రకటించారు. రష్యా నుంచి ఐరోపా దేశాలకు గ్యాస్ ఈ కేంద్రం నుంచే సరఫరా అవుతోంది. ఈయూకి గ్యాస్‌ను సరఫరా చేసేందుకు రష్యాకు ఉన్న ఏకైక మార్గం ఇదే. హోన్‌చరెంకో తాజా ప్రకటనతో రష్యాలోకి తమ బలగాలు ప్రవేశించినట్లు అనధికారికంగా అంగీకరించినట్లేనని మీడియా వర్గాలు పేర్కొంటున్నాయి.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com