Russia : మాస్కోపై ఉక్రెయిన్ మరో దాడి

Russia : మాస్కోపై ఉక్రెయిన్ మరో దాడి
X
రెండు రోజుల్లోనే మరోసారి డ్రోన్ అటాక్

ఉక్రెయిన్ సేనలు మాస్కోపై డ్రోన్లతో మరోసారి దాడులకు పాల్పడ్డాయి. మాస్కోతో పాటు పరిసర ప్రాంతాలలో డ్రోన్లతో దాడి చేసిందని రష్యా ఆరోపించింది. అందులో ఒక డ్రోన్ తమ భవనాన్ని ఢీకొట్టిందని తెలిపింది. మాస్కో వెలుపల రెండు డ్రోన్లను కూల్చివేశామని మరొక దాని సిగ్నల్ కట్ చేసామని రష్యా మంత్రిత్వ శాఖ పేర్కొంది.

ఆదివారం ఉక్రెయిన్ జరిపిన దాడిలో దెబ్బతిన్న భవనాన్నే మరోసారి ఒక డ్రోన్ ఢీకొట్టిందని మాస్కో మేయర్ సెర్గీ తెలిపారు . క్రెమ్లిన్ కు 3.2 km దూరంలో ఉండే ఆ భవనంలోనే అనేక ప్రభుత్వ శాఖలకు చెందిన కార్యాలయాలు ఉన్నాయని వివరించారు. దాడిలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని వెల్లడించారు. ఈ నేపథ్యంలో యుద్ధం అంటే ఏమిటో రష్యా కి త్వరలోనే రుచి చూపిస్తామని, యుద్ధానికి ప్రధాన కారకులు ఉన్న చోటుకు త్వరలోనే చేరుకుంటామని అధ్యక్షుడి సలహాదారు చేసిన ఒక ట్వీట్ ఆసక్తి రేపుతోంది. నల్ల సముద్రంలోని రెండు యుద్ధ నౌకల పైన డ్రోన్లతో దాడికి ఒకరేని బలగాలు ప్రయత్నించాయని ఆ డ్రోన్లను నిర్వీర్యం చేశామని రష్యా సైన్యం తెలిపింది, ఎక్కువ ఎత్తు నుండి వచ్చే బాలిస్టిక్ క్షిపణులను సులభంగా గుర్తించగలిగే వ్యవస్థ రష్యాకు ఉన్నా, తక్కువ ఎత్తులో నెమ్మదిగా వచ్చే డ్రోన్లను పట్టుకోవడం వారికి కొంత కష్టంగానే మారింది.



కొద్ది రోజుల క్రితమే అధ్యక్షుడు వోలోదిమిర్ జెలెన్‌స్కీ సొంత నగరమైన క్రివ్యి రిహ్‌పై రష్యా బాంబుల వర్షం కురిపించింది. ఉక్రెయిన్ ఎదురుదాడులను నిర్వీర్యం చేసే క్రమంలోనే.. ఈ క్షిపణి దాడులు చేసింది. ఈ దాడిలో పదేళ్ల బాలికతో పాటు మొత్తం ఆరుగురు మృతి చెందగా.. 75 మంది గాయపడ్డారు. ఈ ఘటనలో ఒక అపార్ట్‌మెంట్‌తో పాటు ఓ యూనివర్సిటీ తీవ్రంగా దెబ్బతింది. రష్యా చేసిన ఈ దాడులపై ఉక్రెయిన్ అంతరంగిక మంత్రి తీవ్రంగా మండిపడ్డారు. పౌర నివాసాలపై దాడి చేయకూడదనే సాంప్రదాయం ఉన్నప్పటికీ.. రష్యా దాన్ని ఉల్లంఘించిందని, అపార్ట్‌మెంట్లపై విరుచుకుపడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే.. రష్యా వాదన మాత్రం మరోలా ఉంది. తాము కేవలం ఉక్రెయిన్‌ సైనిక స్థావరాలపైనే దాడులు చేస్తున్నట్టు రష్యా తెలిపింది.

కాగా.. ఉక్రెయిన్‌లో రష్యా ఆక్రమించిన భూభాగాల్ని తిరిగి పొందేందుకు ఉక్రెయిన్ ఇటీవల తన దాడుల్ని ఉధృతం చేసింది. నాటో కూటమి ఇచ్చిన ఆధునిక ఆయుధాలతో రష్యాపై విరుచుకుపడుతోంది.. యుద్ధం రష్యా వైపుకు వస్తోంది అంటూ జెలెన్‌స్కీ ఇచ్చిన స్టేట్‌మెంట్ తరువాత వాతావరణం మరింత వేడెక్కింది.

Tags

Next Story