Russia-Ukraine War: భారీ క్షిపణి దాడి.. 400 మంది రష్యన్ సైనికులను మట్టుపెట్టిన ఉక్రెయిన్
Russia Ukraine war update

Russia-Ukraine War : ఉక్రెయిన్ విజయం సాధించే వరకు రష్యాతో పోరాడుతూనే ఉంటుందని ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోదిమిర్ జెలన్ స్కీ క్లారిటీ ఇచ్చాడు. డోనెట్స్‌క్ ప్రాంతంలో తమ సేనలు జరిపిన భారీ క్షిపణి దాడిలో ఏకంగా 400 మంది రష్యా సైనికులు చనిపోయారని ఉక్రెయిన్ ప్రకటించింది. ఈ దాడిలో మరో 300 మంది గాయపడ్డారని తెలిపింది. అయితే 63 మంది సైనికులే చనిపోయారని రష్యా అంటోంది. మకీవ్కా సిటీలో ఈ దాడి జరిగినట్లు సమాచారం. ఓ బిల్డింగ్‌లో రష్యన్ ఆర్మీ రెస్ట్ తీసుకుంటుండగా అదను చూసి ఉక్రెయిన్ హిమార్స్ రాకెట్లతో ఎటాక్ చేసింది. ఈ రాకెట్ లాంచర్లను అమెరికా ఉక్రెయిన్‌కు అందించింది.
అయితే రష్యా వెర్షన్ మాత్రం మరోలా ఉంది..ఉక్రెయిన్ ప్రయోగించిన రెండు రాకెట్లను నేలకూల్చామని మిగతావి భవనాన్ని నేలమట్టంచేశాయని అంటోంది. భవనంలోని సైనికులు ఇంకా యుద్ధంలో నేరుగా పాల్గొనలేదని, ఇటీవల రష్యా నుంచి డోనెట్స్‌క్‌కు చేరుకున్నారని, అదే భవనంలో పేలుడు పదార్థాలు ఉండటంతో విధ్వంసం తీవ్రత పెరిగిందని తెలిపింది. మరోవైపు, డోనెట్స్‌క్‌లో దాడి తర్వాత ఉక్రెయిన్ రాజధాని కీవ్‌పై రష్యా మరోసారి డ్రోన్లకు పనిచెప్పింది.
ఇక గతేడాది ఫిబ్రవరిలో ప్రారంభం అయిన రష్యా-ఉక్రెయిన్ వార్ కొనసాగుతూనే ఉంది. ఇరుదేశాలు పరస్పరం దాడులు చేసుకుంటున్నాయి. ఇప్పటికీ వేల మంది సైనికులు చనిపోయారు. ఇరు వైపులా ప్రాణనష్టం సంభవించింది. అయితే రష్యా చర్చలపై సానుకూలత వ్యక్తం చేసినా.. ఉక్రెయిన్ మాత్రం పుతిన్ రష్యా అధ్యక్షుడిగా ఉన్నంత కాలం చర్చలకు వచ్చేది లేదని తెగేసి చెపుతోంది. ఉక్రెయిన్ భవిష్యత్తులో రష్యాతో యుద్ధాన్ని కొనసాగించేలానే కనిపిస్తోంది. ఇటీవల అమెరికా వెళ్లి వచ్చిన జెలన్ స్కీ ఆయుధాలు, ఆర్థిక సాయాన్ని పొందనున్నారు. అత్యాధునిక పెట్రియాట్ క్షిపణి రక్షణ వ్యవస్థను అమెరికా ఉక్రెయిన్‌కు అందిస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com