Mother Heroine : రష్యా సేనలతో పోరాడి ప్రాణాలొదిలిన 'మదర్ హీరోయిన్'

Mother Heroine : ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణ కొనసాగుతోంది. లక్ష్యం నెరవేరే వరకు వెనక్కి వచ్చే ప్రసక్తే లేదని పుతిన్ తేల్చిచెబుతుండటంతో వందలాది అమాయక ఉక్రేనియన్ పౌరులు ప్రాణాలు కోల్పోతున్నారు. రష్యా సేనలు నిర్దాక్షిణ్యంగా వ్యవహరిస్తూ భవనాలు, థియేటర్లపై బాంబుల వర్షం కురిపిస్తున్నాయి.
అటు రష్యా సేనల దాడిలో 12మంది పిల్లల తల్లి' ఓల్గా సెమిడ్యానోవా మృతి చెందిన విషయం తాజాగా 'కీవ్ ఇండిపెండెంట్' వెలుగులోకి తెచ్చింది. డొనెట్స్క్ సమీపంలో రష్యా సేనలతో చివరి కంటా పోరాడిన ఓల్గా సెమిడ్యానోవా చివరికి ప్రాణాలు విడిచారు. తమ యూనిట్‌లోని ఒక్కొక్కరు ప్రాణాలు కోల్పోతున్నా... ధైర్యం కోల్పోని 48 ఏళ్ల ఓల్గా... చివరి రక్తపు బొట్టు వరకు పోరాటం కొనసాగించినట్లు ఆర్మీ తెలిపింది. భారీ భీకర పోరు జరుగుతుండడంతో మృతదేహాన్ని స్వాధీనం చేసుకోవడం సాధ్యం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
రష్యా- ఉక్రెయిన్‌ల మధ్య భీకర పోరు కొనసాగుతోంది. తక్షణమే యుద్ధం ఆపాలంటూ అంతర్జాతీయ న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలను రష్యా తిరస్కరించింది. ఐసీజే ఆదేశాలను బేఖాతరు చేస్తూ భీకర యుద్ధం చేస్తోంది. రష్యా దండయాత్రతో తమదేశం ఎంతగా ధ్వంసమైందో తెలుపుతూ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ భావోద్వేగ వీడియోను పోస్ట్ చేశారు. దాడులకు ముందు ఉక్రెయిన్ ఎలా ఉందో.. ఇప్పుడు ఎంతటి భయానక పరిస్థితుల్లో చిక్కుకుందనేది వీడియో కళ్లకు కడుతోంది. బాంబు దాడిలో ధ్వంసమైన భవనాలు, శవాల గుట్టాలు, వలస వెళ్తున్న చిన్నారుల ఆర్తనాదాలు వంటి హృదయ విదారక దృశ్యాలు కలచివేస్తున్నాయి.
అటు ఉక్రెయిన్ కూడా అమెరికా సహకారంతో రష్యాకు ధీటైన సమాధానమిస్తోంది. ఇప్పటివరకు 14వేల మందికి పైగా రష్యా సైనికుల్ని అంతం చేసినట్టు ప్రకటించింది. అమెరికా కూడా ఉక్రెయిన్‌కు అవసరమైన సైనిక సాయాన్ని మెల్లగా పెంచుతోంది. తాజాగా మరో 800 మిలియన్ డాలర్ల సైనిక సాయాన్ని అందించింది. ఇప్పటికే జావెలిన్, స్టింగర్‌తో ఉక్రెయిన్ డిఫెన్స్‌ను బలోపేతం చేసిన అమెరికా.. తాజాగా స్విచ్ బ్లేడ్ ఆత్మాహుతి డ్రోన్లను అందజేసింది. ఈ డ్రోన్లు రష్యా సైనిక వాహనాల కదలికలను, కాన్వాయ్‌లను దారుణంగా దెబ్బతీయవచ్చని అంచనా వేస్తున్నారు. వీటితో కొన్ని కిలోమీటర్ల ముందు నుంచే శత్రువులపై విరుచుకుపడొచ్చంటున్నారు.
రష్యా తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు అమెరికా ప్రెసిడెంట్ జోబైడెన్. పుతిన్ యుద్ధ నేరస్థుడంటూ మండిపడ్డారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ సైతం స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. అమెరికా సహా ఆంక్షలు విధిస్తున్న దేశాల ఆధిపత్యాన్ని సహించేది లేదన్నారు. ఎవరికీ తలొగ్గేదే లేదని స్పష్టం చేశారు. దేశాన్ని నాశనం చేయడానికి రష్యాలోని కొందరు ద్రోహులను పశ్చిమ దేశాలు పావులుగా వాడుకుంటున్నాయని మండిపడ్డారు. ఎవరెన్ని కుట్రలు పన్నినా ఉక్రెయిన్ విషయంలో అనుకున్న లక్ష్యాలను సాధించి తీరుతామన్నారు పుతిన్.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com