Russia-Ukrain War: అణుయుద్ధానికి అవకాశం ఉంది: రష్యా మాజీ అధ్యక్షుడు
ఉక్రెయిన్‌తో యుద్ధం రష్యా అస్తిత్వం కోసం పోరాటం అని రష్యా మాజీ అధ్యక్షుడు మెద్వెదెవ్ అన్నాడు. నాటోలో ఉక్రెయిన్ చేరకుండా చేయడమే తమ లక్ష్యం అని ప్రకటించాడు. దీని కోసం రష్యా ఎంతకైనా తెగిస్తుందని హెచ్చరించాడు. ఒక వార్తా పత్రికకు రాసిన ఆర్టికల్‌లో పలు విషయాలు వెల్లడించాడు. రష్యా సెక్యూరిటీ కౌన్సిల్ డిప్యూటీ ఛైర్మన్ కూడా అయిన మెద్వెదెవ్, ప్రస్తుత అధ్యక్షుడు పుతిన్‌కి అత్యంత సన్నిహితుడు.
పశ్చిమ దేశాలు ఈ యుద్ధంలో పదే పదే తలదూరిస్తే అణు యుద్ధం జరిగే అవకాశాలు కొట్టిపారేయలేమన్నాడు. అదే జరిగితే ఎవరమూ విజేతలం కాలేమంటూ అమెరికా, మిత్రదేశాలకు హెచ్చరికలు పంపాడు. పాశ్యాత్య దేశాలతో కఠినమైన నిర్ణయాలు, చర్చల తర్వాతే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశాడు.
నాటోలో చేరతామని చెబుతూ ఉక్రెయిన్ తమని బెదిరింపులకు గురి చేసిందని అన్నాడు. దాంతో మాకు ఉక్రెయిన్‌పై దాడి తప్ప అవకాశం లేకుండా పోయిందని వెల్లడించారు.
"మేము ఎప్పుడూ ఒక విషయాన్ని మాత్రమే అడుగుతూ వచ్చాం. మా ఆందోళనలను అర్థం చేసుకొని, రష్యాలో పూర్వ భాగాలైన దేశాలను నాటోలోకి ఆహ్వానించవద్దని కోరుతూ వస్తున్నాం. ముఖ్యంగా మా దేశంతో సరిహద్దు సమస్యలు ఉన్న దేశాలతో అసలే వద్దని హెచ్చరించాం. అయినా వారు వినలేదు. దీంతో మా ముందు ఒకే లక్ష్యం పెట్టుకున్నాం. నాటోలో ఉక్రెయిన్ చేరనుందనే భయాందోళను దూరం చేయాలనుకున్నాం" అని తమ లక్ష్యాల్ని స్పష్టం చేశాడు.
నాటో కూటమి బలగాలు తమ దేశ దరిదారుపుల్లో విస్తరించకుండా ఉండాలనే ఉద్యేశ్యంతోనే ఉక్రెయిన్‌పై దాడులకు దిగాల్సి వచ్చిందని వెల్లడించాడు. రష్యా అస్తిత్వం కాపాడుకోవడానికి మేం ఎంతదూరమైనా వెళ్తామన్నాడు. దానికోసం రష్యా-ఉక్రెయిన్ సమస్య శాశ్వతంగా ఉంచేలా చేయడానికి కూడా తాము వెనుకాడమని హెచ్చరించాడు.
ఇదిలా ఉండగా శనివారం రాత్రి కీవ్ మీద రష్యా డ్రోన్ దాడులు జరిపినట్లు ఉక్రెయిన్ మిలటరీ అధికారి వెల్లడించాడు. ఈ దాడిలో ఎంతమంది చనిపోయారనే దానిపై సమాచారం లేదన్నాడు. ఉక్రెయిన్‌కి తూర్పు, దక్షిణ ప్రాంతాల్లో రష్యా బాంబ్ దాడులు జరిగాయని అధికారులు వెల్లడించిన మరుసటి రోజే ఈ దాడులు జరగటం గమనార్హం.
రష్యా బలగాలు ముందుకు చొచ్చుకు వస్తున్న ప్రాంతాల్లో తాము దాడులు కొనసాగిస్తున్నట్లు ఉక్రెయిన్ అధికారులు వెల్లడిస్తున్నారు.
గత ఏడాది ఫిబ్రవరి రష్యా, ఉక్రెయిన్‌పై దాడులు ప్రారంభించనప్పటీ ఆ ప్రాంతాలు రావణకాష్టంలా కాలుతూనే ఉన్నాయి. ఉక్రెయిన్‌లోని కీలక ప్రాంతాల్లో దాడులు చేస్తూ వస్తున్న రష్యా నెల రోజుల క్రితం ఉక్రెయిన్‌లోని ప్రధాన రిజర్వాయర్‌ని పేల్చేసి జలప్రళయం సృష్టించింది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com