UKRAINE: మళ్లీ నెత్తురోడుతున్న ఉక్రెయిన్

ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్రను మరింత ఉద్ధృతం చేసింది. కీలక ప్రాంతాలపై తిరిగి పట్టు సాధించేందుకు దాడుల తీవ్రత పెంచింది. ఉక్రెయిన్ రాజధాని కీవ్ సమీపంలో మళ్లీ దాడులు చేసిన మాస్కో బలగాలు.... ఆయుధ స్థావరాలను ధ్వంసం చేసినట్లు తెలిపాయి. రష్యా సేనలు చేసిన దాడుల్లో 30మందికిపైగా మృతి చెందారు. ఒక్కరోజు వ్యవధిలో రష్యా... 158 క్షిపణులను ప్రయోగించినట్లు ఉక్రెయిన్ తెలిపింది. ఉక్రెయిన్‌కు ఆర్థిక సాయం ప్యాకేజీని అమెరికా ఆమోదించిన తర్వాత ఈ దాడులు తీవ్రరూపం దాల్చాయి.ఉక్రెయిన్ మళ్లీ నెత్తురోడుతోంది. గగనతల దాడులను రష్యా మరింత తీవ్ర చేయడంతో ఉక్రెయిన్ క్షిపణి మోతలతో దద్దరిల్లిపోతోంది. ఎడతెగని దాడులతో జెలెన్ స్కీ బలగాల కీలక స్థావరాలను రష్యా ధ్వంసం చేస్తోంది. ఉక్రెయిన్‌లోని ప్రధాన నగరాలే లక్ష్యంగా మాస్కో చేసిన దాడుల్లో 12 మందికిపైగా మరణించగా 30మందికిపైగా గాయపడ్డారు. యుద్ధం ప్రారంభమై ఏడాదిన్నరలో రష్యా వైమానిక దళం ఉక్రెయిన్‌లోని ఇన్ని ప్రదేశాలను ఒకేసారి ఎప్పుడూ లక్ష్యంగా చేసుకోలేదని ఉక్రెయిన్ అధికారులు వెల్లడించారు. రష్యా దాడుల్లో చాలచోట్ల బహుళ అంతస్తుల భవనాలు దెబ్బతిన్నాయి. బాంబు దాడిలో మంటలు ఎగిసిపడగా ఉక్రెయిన్‌లోని విపత్తు నిర్వహక బృందాలు వాటిని అదుపులోకి తీసుకొచ్చాయి.
ఉక్రెయిన్‌పై రష్యా కనీవినీ ఎరుగని స్థాయిలో దాడి చేసిందని అక్కడి పరిస్థితులు చూస్తే అర్థమవుతోంది. ఉక్రెయిన్‌పై మాస్కో 158 క్షిపణులు సహా డ్రోన్లు కూడా ప్రయోగించిందని అధ్యక్షుడు జెలెన్ స్కీ వెల్లడించారు.ఇరాన్ తయారు చేసిన షాహెద్ డ్రోన్లను రష్యా తమపై దాడికి వినియోగించిందని. ఉక్రెయిన్ సాయుధ దళాల కమాండర్ ఇన్ చీఫ్ వాలెరీ జలుజ్నీ ఆరోపించారు. 55 క్రూయిజ్ క్షిపణులు, 14 బాలిస్టిక్ క్షిపణులు, ఐదు ఏరోబాలిస్టిక్ క్షిపణులు, అనేక యాంటీ రాడార్ క్షిపణులను మాస్కో సేనలు తమపై ప్రయోగించాయని.. వాటిలో కొన్నింటిని తాము తిప్పికొట్టామని కూడా తెలిపారు. రష్యా ప్రయోగించిన 27 డ్రోన్లను... 87 క్షిపణులను ఉక్రెయిన్ కూల్చివేసిందని జలుజ్నీ చెప్పారు. రష్యా దాడిలో ఇళ్లు, ఆసుపత్రులు కూడా ధ్వంసమయ్యాయని జెలెన్ స్కీ ఆరోపించారు. రాజధాని కీవ్, లివివ్, ఒడెసా, జపోరిజ్జియా, డ్నిప్రో, ఖార్కివ్ సహా చాలా ప్రాంతాల్లో భీకర దాడులు జరిగినట్లు వెల్లడించారు. ఉక్రెయిన్‌కు ఆర్థిక సాయం ప్యాకేజీని అమెరికా ఆమోదించిన తర్వాత ఈ దాడులు తీవ్రరూపం దాల్చాయని జెలెన్‌స్కీ సహాయకుల్లో ఒకరు తెలిపారు.
ఉక్రెయిన్‌లోని ఒడెసాలో రష్యా భీకర దాడులకు స్థానికులు వణికిపోయారు. ఒడెసాలోని దృశ్యాలు భయబ్రాంతులకు గురిచేసేలా ఉన్నట్లు ఉక్రెయిన్ స్టేట్ ఎమర్జెన్సీ సర్వీస్ చిత్రీకరించిన దృశ్యాల ద్వారా వెల్లడైంది. గురువారం మధ్యాహ్నం ప్రారంభమైన వైమానిక దాడులు నిర్విరామంగా కొనసాగుతూనే ఉన్నాయని స్థానికులు వెల్లడించారు. రష్యా దాడుల్లో ఒడెసా, కీవ్, లివివ్, ఖార్కివ్‌లో పౌర మౌలిక సదుపాయాలకు నష్టం వాటిల్లిందని ఆ ప్రాంతాల మేయర్లు ప్రకటించారు. రష్యా ప్రయోగించిన అధునాతన క్షిపణులు, డ్రోన్లు ఉక్రెయిన్ రక్షణ వ్యవస్థలు కూల్చివేశాయని మాస్కో ప్రకటించింది. మానవరహిత విమానాలు బహుళ అంతస్తు భవనాలపై దాడులు చేశాయి. డ్నిప్రోలో షాపింగ్ మాల్‌లో బాంబు దాడిలో మంటలు చెలరేగిన దృశ్యాలను ఉక్రెయిన్ అధ్యక్ష కార్యాలయం విడుదల చేసింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com