Movie shooting in Space: కోట్ల ఖర్చుతో స్పేస్‌లో సినిమా షూటింగ్.. 12 రోజులు అక్కడే..

Movie shooting in Space: స్పేస్ టూరిజం ఇప్పటికే మొదలైంది. ఆస్ట్రోనాట్లే కానక్కర్లేదు.. కాస్త డబ్బులు పెట్టగలిగితే ఎవరైనా అంతరిక్షంలోకి వెళ్లిరావొచ్చు. ఇప్పుడు ఇందుకో ఇంకో అడుగు ముందుకేస్తూ ఏకంగా రోదశిలో సినిమా షూటింగ్ కోసం ఓ బృందం బయలు దేరింది. రష్యాకి చెందిన టీమ్.. "ది ఛాలెంజ్" పేరుతో ఓ సినిమా తీస్తోంది. దీనికోసం చిత్ర యూనిట్ అంతరిక్షయాత్ర చేస్తోంది.
డైరక్టర్ క్లిమ్ షిపెంకో, లీడ్ క్యారెక్టర్ చేస్తున్న యులియా, మరికొందరు స్పేస్‌లోకి వెళ్లారు. రష్యా అంతరిక్ష పరిశోధన సంస్థకు చెందిన వ్యామొనౌకలో కజికిస్థాన్ నుంచి నిన్న బయలుదేరి వెళ్లారు. 12 రోజులపాటు అక్కడే ఉండి షూటింగ్ పూర్తి చేసుకుని తిరిగి భూమికి వస్తారు. సినిమా షూటింగ్ కోసం ఇంత సీన్ అవసరమా అని ఎవరికైనా అనిపించొచ్చు. గతంలో చాలా సినిమాలు తీసినట్టే దీన్ని కూడా గ్రాఫిక్స్‌లో తీయ్యొచ్చు కదా అని ప్రశ్నించొచ్చు.
ఐతే.. రష్యా మూవీ టీమ్ ఇదంతా పూర్తి లైవ్‌లీగా తీస్తామంటోంది. నిజానికి వాళ్ల సినిమా కూడా అంతరిక్షానికి సంబంధించిందే. స్పేస్ స్టేషన్‌లో ఉన్న ఓ వ్యామొగామి అనుకోకుండా ప్రాణాపాయ స్థితిలో పడతాడు. అతన్ని కాపాడేందుకు భూమి నుంచి ఓ డాక్టర్‌ను స్పేస్‌కు పంపాలి. అలా వెళ్లిన డాక్టర్ అక్కడ ఆ ఆస్ట్రోనాట్‌ను ఎలా కాపాడారు అనేదే వీళ్ల మూవీ. స్పేస్‌లోకి వెళ్లడం, రావడం, అక్కడ జరిగే సీన్లు అంతా కలిసి దాదాపు 40 నిమిషాల వరకూ ఉంటుందట. ఈ షూటింగ్ కోసమే స్పేస్‌కు వెళ్తున్నట్టు డైరెక్టర్ వివరించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com