ukraine crisis: కీవ్ పై రష్యా దాడి..

ప్రపంచం మెుత్తం ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంపై దృష్టి సారిస్తే మరోపక్క రష్యా-ఉక్రెయిన్ తమ పోరును కొనసాగిస్తున్నాయి. శనివారం కీవ్‌పై రష్యా డ్రోన్లతో దాడి చేయగా అందుకు ప్రతీకారం మాస్కోపై ఉక్రెయిన్ డ్రోన్లతో దాడికి దిగింది. ఇన్నాళ్లు రాకెట్లు, మోర్టార్ షెల్స్, బాంబులు, క్షిపణులతో పరస్పర దాడులకు దిగిన ఇరు దేశాలు ఇప్పుడు డ్రోన్లతో విరుచుకపడుతున్నాయి.
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మరోసారి వార్తల్లోకి ఎక్కింది. ఇన్నాళ్లు దాడి తీవ్రతను తగ్గించిన ఇరు దేశాలు తాజాగా మళ్లీ పరస్పరం దాడులకు దిగుతున్నాయి. రష్యా, ఉక్రెయిన్ మధ్య భీకర డ్రోన్ దాడులు జరుగుతుండగా అక్కడ మళ్లీ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. మాస్కో పరిసర ప్రాంతాల్లోకి ఉక్రెయిన్ డజన్లకుపైగా డ్రోన్లను ప్రయోగించి దాడికి యత్నించిందని రష్యా ఆరోపించింది. తమ గగనతల రక్షణ వ్యవస్థలు 24 ఉక్రెయిన్ డ్రోన్లను అడ్డగించాయని రష్యా రక్షణశాఖ పేర్కొంది. డ్రోన్ దాడులతో మూడు భవనాలు పాక్షికంగా దెబ్బతిన్నాయని మాస్కో గవర్నర్ తన టెలిగ్రామ్ ఛానల్‌లో పేర్కొన్నారు. ఈ దాడుల్లో ఎవరు గాయపడలేదని తెలిపారు. మాస్కోకు 180 కిలోమీటర్ల దూరంలో ఉన్న తులా నగరంలో 12 అంతస్తుల భవనంపై డ్రోన్ పడటంతో ఒకరికి గాయాలయ్యాయని రష్యాకు చెందిన టెలిగ్రామ్ ఛానల్స్ తెలిపాయి. డ్రోన్ దాడులతో మాస్కో చుట్టుపక్కల ఉన్న రెండు విమానాశ్రయాలను అధికారులు తాత్కాలికంగా మూసివేశారని రష్యాకు చెందిన టాస్ వార్తా సంస్థ పేర్కొంది. అయితే రష్యా ఆరోపణలపై ఉక్రెయిన్ అధికారికంగా స్పందించలేదు.
రష్యా కూడా శనివారం ఉక్రెయిన్ రాజధాని కీవ్‌పైకి ఇరాన్‌కు చెందిన 75 షాహెద్ డ్రోన్లతో విరుచుకుపడింది. కీవ్‌తోపాటు సుమీ, జపోరిజియా, మైకోలైవ్ తదితర ప్రాంతాలపైనా రష్యా సేనలు డ్రోన్ దాడులు జరిపాయని ఉక్రెయిన్ అధికారులు తెలిపారు. రష్యా ప్రయోగించిన 75 డ్రోన్లలలో 71 డ్రోన్లను తమ గగనతల రక్షణ వ్యవస్థను ధ్వంసం చేసినట్లు ఉక్రెయిన్ అధికారులు వెల్లడించారు. డ్రోన్ శిథిలాలు పడటంతో అనేక భవనాలు దెబ్బతిన్నాయని తెలిపారు. 2022 ఫిబ్రవరిలో రష్యా సైనిక చర్య మొదలైన తర్వాత మాస్కో జరిపిన అతిపెద్ద డ్రోన్ దాడి ఇదేనని ఉక్రెయిన్ బలగాలు తెలిపాయి. ఈ దాడుల్లో దాదాపు ఐదుగురు పౌరులు గాయపడినట్లు కీవ్ మేయర్ పేర్కొన్నారు
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com