Salwan Momika: ఖురాన్‌ను తగులబెట్టిన వ్యక్తి దారుణ హత్య

2023లో స్వీడన్ లో ముస్లింల పవిత్ర గ్రంథం అయిన ఖురాన్ ప్రతులను తగులబెట్టి ముస్లిం దేశాల్లో తీవ్ర నిరసనలు, ఆందోళనలకు కారణమైన సాల్వన్ మోమికా అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. గురువారం స్వీడన్‌లోనే గుర్తు తెలియని వ్యక్తుల కాల్పుల్లో అతడు మరణించాడు. ఈ విషయాన్ని స్వీడన్ మీడియా వెల్లడించింది. అక్కడి పోలీసులు కూడా కాల్పుల్లో సాల్వన్ మోమికా మృతిచెందిన విషయాన్ని ధృవీకరించారు.
ఇరాకీ క్రిస్టియన్ అయిన సాల్వన్ మోమికా.. స్వీడన్‌లోని సోడర్టల్జీ ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. అయితే 2023లో అతడు పదే పదే ఖురాన్‌ను తగులబెట్టారు. తీవ్రంగా అగౌరవ పరిచారు. వాటిని వీడియోలుగా తీస్తూ.. సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఖురాన్‌ను తగులబెడుతూ, అపవిత్రం చేస్తూ ఉన్న ఈ వీడియోలు ప్రపంచ వ్యాప్తంగా వైరల్ అయ్యాయి. ఈక్రమంలోనే ముస్లిం దేశాలన్నీ పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేశాయి. సాల్వన్ మోమికా చేసిన పని వల్ల అనేక దేశాల్లో అల్లర్లు, అశాంతి చెలరేగగా... ఈయనపై తీవ్ర వ్యతిరేకత వచ్చింది.
సాల్వన్ మోమికా ఖురాన్‌ను తగులబెట్టి సమాజంలో విద్వేషాలను రెచ్చగొట్టారనే కేసులో స్టాక్ హోమ్ కోర్టు తీర్పు వెలువరించాల్సి ఉంది. ఇంతలో మోమికా హత్యకు గురికావడంతో తీర్పును ఫిబ్రవరి 3వ తేదీకి వాయిదా వేసింది. సొడర్టల్జీ నగరంలో కాల్పులు జరుగుతున్నాయనే సమాచారం అందడంతో స్థానిక పోలీసులు అక్కడికి చేరుకున్నారు.
మోమికా నివాసం ఉండే ఇంటి లోపల ఈ కాల్పులు చోటుచేసుకున్నాయి. పోలీసులు వెళ్లేసరికి మోమికా రక్తపు మడుగులో పడివున్నాడు. అతడి ఒంటిపై తూటాల గాయాలు ఉన్నాయి. హుటాహుటిన అతడిని ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. సాల్వన్ మోమికా ఇస్లాం మతంపై ద్వేశంతో 2023లో స్వీడన్‌లోని పలు ప్రాంతాల్లో ఖురాన్ ప్రతులను తగులబెట్టి తన నిరసన వ్యక్తం చేశాడు. ఈ క్రమంలో ఇవాళ ఆయన హత్యకు గురయ్యాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com