Planet K2-18b: భూమి నుంచి 700 ట్రిలియన్ మైళ్ల దూరంలో మరో గ్రహం

గ్రహాంతర జీవుల అన్వేషణలో ఖగోళ భౌతిక శాస్త్రవేత్తలు పురోగతి సాధించారు. జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ సాయంతో సౌర వ్యవస్థ ఆవల జీవసంబంధ ఆనవాళ్లను కనుగొన్నారు. కే2-18బీ అనే గ్రహంపై డైమిథైల్ సల్ఫైడ్ (డీఎంఎస్), డైమిథైల్ డైసల్ఫైడ్ (డీఎండీఎస్) అనే వాయువులను గుర్తించారు. ఇవి సూక్ష్మజీవుల ఉనికికి సంకేతాలు. యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జ్‌కు చెందిన ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రానమీ ఆధ్వర్యంలో ఈ పరిశోధనలు జరిగాయి. ఈ మేరకు ఆస్ట్రోఫిజికల్ జర్నల్ లెటర్స్‌లో అధ్యయనం ప్రచురితమైంది. ఈ పరిశోధనకు భారత్ సంతతి శాస్త్రవేత్త నిక్కు మధుసూధన్ నేతృత్వం వహించడం విశేషం.
భారత సంతతికి చెందిన ప్రొఫెసర్ నిక్కు మధుసూదన్ సారథ్యంలోని కేంబ్రిడ్జ్ శాస్త్రవేత్తల టీమ్ తాజాగా చేసిన ఓ పరిశోధనలో కీలక విషయాలు తెలిశాయి. కే2-18బీ అనే గ్రహం సూర్యుడి చుట్టూ కాకుండా మరో నక్షత్రం చుట్టూ తిరుగుతుంది. ఆ గ్రహంపై జీవరాశి ఉండే అవకాశం ఉందనడానికి తాజాగా ఈ పరిశోధకులు ఆధారాలు గుర్తించారు. ఆ గ్రహంపై జీవరాశికి సంబంధించిన డైమిథైల్ సల్ఫైడ్ (DMS), డైమిథైల్ డైసల్ఫైడ్ (DMDS) అనే వాయువులు వాతావరణంలో ఉన్నట్టు గుర్తించారు. ఇవి భూమ్మీద ప్రధానంగా సముద్ర జీవులు, బ్యాక్టీరియాలు ఉత్పత్తి చేసేవే. జీవానికి సంబంధించిన సంకేతాలు ఆ గ్రహంపై భారీ స్థాయిలో కనిపించడం ఆశ్చర్యకరమని శాస్త్రవేత్తలు అంటున్నారు.
దీనిపై ఇంకా స్పష్టమైన సమాచారం రావాల్సిన అవసరముంది. ఈ గ్రహం మీద జీవం ఉండే అవకాశముందని, త్వరలోనే ధ్రువీకరించగలమన్న నమ్మకం ఉందని శాస్త్రవేత్తలు అంటున్నారు. కే2-18బీ అనే గ్రహం మన భూమి కన్నా రెండున్నర రెట్లు పెద్దది. భూమి నుంచి సుమారు 700 ట్రిలియన్ మైళ్ల దూరంలో ఈ గ్రహం ఉంది. అంటే 120 కాంతి సంవత్సరాల దూరంగో ఈ గ్రహం ఉంటుంది.
కే2-18బీ గ్రహంలో జీవరాశి ఉండొచ్చని మధుసూదన్ సారథ్యంలోని కేంబ్రిడ్జి పరిశోధక బృందం గుర్తించినప్పటికీ, తమ పరిశోధన ఫలితాలు పూర్తిగా ధ్రువీకరించవచ్చని మాత్రం చెప్పలేమని అంది. కొత్తగా గుర్తించిన ఆధారాలను “ఆవిష్కరణ”గా పరిగణించడానికి ఆ ఫలితాలు 99.99% కంటే ఎక్కువ శాతం కచ్చితమైనవిగా ఉండాలి. మధుసూదన్ సారథ్యంలోని కేంబ్రిడ్జి పరిశోధక బృందం గుర్తించిన ఫలితాలు 99.7% కచ్చితత్వంతో ఉన్నాయి.
డాక్టర్ మధుసుధన్ 1980లో భారత్‌లో జన్మించారు. అండర్ గ్రాడ్యుయేట్ విద్యను వారణాసి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలోని వారణాసిలో పూర్తి చేశారు. బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ డిగ్రీ పట్టా పొందారు. ఆ తర్వాత మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో గ్రాడ్యుయేట్ చేశారు. అక్కడే ప్లానెటరీ సైన్స్‌లో మాస్టర్ డిగ్రీ, పీహెచ్‌డీ పూర్తి చేశారు. ఎక్సోప్లానెట్ పరిశోధనలో డాక్టర్ సారా సీజర్ మార్గదర్శకత్వంలో పనిచేశారు.
ప్రస్తుతం మధుసుధన్ కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్‌గా చేస్తున్నారు. ఆయన సౌర వ్యవస్థ వెలుపల ఉండే గ్రహాలపై వాతావరణం, జీవరాశిపై పరిశోధనలు చేస్తున్నారు. “హైసియన్ గ్రహాలు” అనే కాన్సెప్ట్‌ను పరిచయం చేసినందుకు ఆయన చాలా గుర్తింపు వచ్చింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com