ఏపీలో ప్రాదేశిక ఎన్నికలపై ఎస్‌ఈసీ కీలక ఆదేశాలు..!

ఏపీలో ప్రాదేశిక ఎన్నికలపై ఎస్‌ఈసీ కీలక ఆదేశాలు..!
ఏపీ ఎన్నికల కమిషన్ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. స్థానిక సంస్థలైన ZPTC, MPTC ఎన్నికలపై ఎస్‌ఈసీ కీలక ఆదేశాలు జారీ చేసింది.

ఏపీ ఎన్నికల కమిషన్ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. స్థానిక సంస్థలైన ZPTC, MPTC ఎన్నికలపై ఎస్‌ఈసీ కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రలోభాలు, బెదిరింపుల కారణంగా నామినేషన్లు వేయనివారికి ఎన్నికల సంఘం మరో అవకాశం కల్పించింది. అభ్యర్థులు తమ వద్ద ఉన్న ఆధారాలతో జిల్లా కలెక్టర్లను కలిస్తే మళ్లీ నామినేషన్ వేసేందుకు అవకాశ మిస్తామని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఈ నెల 20వ తేదీలోపు ఇటువంటి నామినేషన్ల వ్యవహారాన్ని ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకురావాలని అన్ని జిల్లాల కలెక్టర్లను ఎస్‌ ఈసీ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్ ఆదేశించారు.

ZPTC, MPTC నామినేషన్లపై జిల్లా కలెక్టర్లు ఇచ్చే నివేదికల ఆధారంగా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఎస్ఈసీ వెల్లడించింది. గతంలో నామినేషన్లు అడ్డుకున్న సమయంలో రిటర్నింగ్ అధికారులకు, పోలీసులకు చేసిన ఫిర్యాదు పేపర్లను కూడా ఈ సందర్భంగా సమర్పించాలని ఎస్ఈసీ పేర్కొంది. ఫిర్యాదులు లేకపోయినా.. మీడియాలో వచ్చిన వార్తల, క్లిప్పింగ్‌ల ఆధారంగా బాధితులు కలెక్టర్లకు ఫిర్యాదు చేయవచ్చని ఎస్‌ఈసీ వెల్లడించింది. స్థానిక సంస్థల ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించేందుకు అన్నిచర్యలు తీసుకుంటున్నట్లు ఎస్‌ఈసీ పేర్కొంది.

మున్సిపల్ ఎన్నికల్లో బెదిరింపుల కారణంగా నామినేషన్ వేయనివారికి తిరిగి అవకాశం కల్పించాలని గుంటూరులోని మాచర్ల, కడపలోని పులివెందుల, రాయచోటి, చిత్తూరులోని పుంగనూరు, పలమనేరు, తిరుపతి నగర పాలక సంస్థలో సింగిల్ నామినేషన్లపై అధికారులను రమేశ్ కుమార్ నివేదిక కోరారు. ఈనెల 20 లోపు పూర్తిస్థాయి నివేదిక అందించాలని ఆదేశాలు జారీ చేశారు.

బెదిరిస్తున్నారని రిటర్నింగ్ అధికారులకు, పోలీసులకు ఫిర్యాదు చేసి ఉంటే ఆ వార్డుల్లో నామినేషన్లు తీసుకోవాలని సూచించారు. బెదిరింపులపై మీడియాలో వచ్చిన వార్తలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని ఆదేశించారు. అటువంటి వారు ఎవరైనా ఉంటే సంబంధిత అధికారులను సంప్రదించాలన్నారు. రాజకీయ పార్టీలు, పలువురి విజ్ఞప్తి మేరకు ఎస్‌ఈ సీ ఈ నిర్ణయం తీసుకుంది.

Tags

Read MoreRead Less
Next Story