Myanmar: మయన్మార్‌లో మళ్లీ భూకంపం..

మయన్మార్ ను వరుస భూకంపాలు వణికిస్తున్నాయి. గత నెల 28న 7.7 తీవ్రతతో అక్కడ సంభవించిన పెను భూకంపం ధాటికి వేలాది మంది మరణించిన విషయం తెలిసిందే. ఆ ఘటన మరవకముందే అక్కడ వరుస భూ ప్రకంపనలు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా సోమవారం ఉదయం కూడా మయన్మార్‌లో గంటల వ్యవధిలోనే రెండుసార్లు భూమి కంపించింది.
ముందుగా సోమవారం తెల్లవారుజామున ఒకటిన్నర గంటల సమయంలో 4.5 తీవ్రతతో భూమి కంపించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ వెల్లడించింది. 10 కిలోమీటర్ల లోతులో భూకంపం కేంద్రాన్ని గుర్తించినట్లు తెలిపింది. ఆ తర్వాత గంటల వ్యవధిలోనే అంటే ఉదయం 10:06కి మరోసారి భూమి కంపించింది. రిక్టరుస్కేలుపై భూకంపం తీవ్రత 4.1గా నమోదైనట్లు ఎన్‌సీఎస్ వెల్లడించింది. భూమికి 103 కిలోమీటర్ల దూరంలో భూకంపం కేంద్రం ఉన్నట్లు పేర్కొంది. 24 గంటల వ్యవధిలోనే రెండుసార్లు భూకంపం వచ్చింది. అయితే, స్వల్ప స్థాయిలోనే ప్రకంపనలు ఉండటంతో ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని అధికారులు పేర్కొన్నారు.
ఇక ఆదివారం ఉదయం కూడా మయన్మార్‌లో భూమి కంపించిన విషయం తెలిసిందే. మాండలే నగరానికి దక్షిణాన 97 కిలోమీటర్ల దూరంలోని వుండ్‌విన్ పట్టణంలో ఆదివారం ఉదయం ప్రకంపనలు వచ్చాయని ఆ దేశ వాతావరణ విభాగం తెలిపింది. రిక్టరు స్కేలుపై భూకంపం తీవ్రత 5.5గా నమోదైనట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. మయన్మార్ రాజధాని నేపిడా, రెండో పెద్ద నగరమైన మాండలే మధ్య ఈ భూకంప కేంద్రం ఉన్నట్లు అంచనా వేసింది. కాగా.. గతనెల 28న 7.7 తీవ్రతతో అక్కడ సంభవించిన పెను భూకంపం ధాటికి 3 వేల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. సుమారు 5 వేల మంది గాయపడ్డారు. ప్రస్తుతం ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com