Venezuela: మాడురో ఎన్నిక‌.. వెనిజులాలో ఆందోళ‌న‌..

నిర‌స‌కారుల‌పై పోలీసుల ఫైరింగ్

వెనిజులా దేశాధ్య‌క్షుడిగా నికోల‌స్ మాడురో మూడోసారి విజ‌యం సాధించిన విష‌యం తెలిసిందే. అయితే ఆ ఎన్నిక‌ను వ్య‌తిరేకిస్తూ ప్ర‌జ‌లు ఆందోళ‌న చేప‌ట్టారు. ఆదివారం జ‌రిగిన నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న‌పై భ‌ద్ర‌తా ద‌ళాలు చెద‌ర‌గొట్టాయి. టియ‌ర్ గ్యాస్, ర‌బ్బ‌ర్ బుల్లెట్ల‌ను ప్ర‌యోగించారు. దేశ రాజ‌ధాని సెంట్ర‌ల్ క‌రాకాస్‌లో వేల మంది ప్ర‌ద‌ర్శ‌న చేప‌ట్టారు. స్ల‌మ్ ప్రాంతాల నుంచి కొన్ని మైళ్ల దూరం జ‌నం న‌డిచివ‌చ్చారు. ప‌ర్వ‌త ప్రాంతాల నుంచి కూడా జ‌నం వ‌చ్చి ఆందోళ‌న‌లో పాల్గొన్నారు. ప్రెసిడెన్షియ‌ల్ ప్యాలెస్ మార్గంలో ర్యాలీ తీశారు.

ఎన్నిక‌ల్లో గెలిచినట్లు మాడురో ప్ర‌క‌టించిన నేప‌థ్యంలో ప్ర‌జ‌లు ఆందోళ‌న‌కు దిగారు. ఫ‌లితాల్లో మోసం జ‌రిగిన‌ట్లు ప్ర‌తిప‌క్షాలు ఆరోపించాయి. ప్ర‌తిప‌క్ష నేత ఎడ్ముండో గొంజాలేజ్‌.. 73.2 శాతం ఓట్ల‌తో గెలుపొందిన‌ట్లు తెలిపారు. 11 ఏళ్లుగా అధికారంలో ఉన్న మాడురోను గ‌ద్దె దించేందుకు .. ప్ర‌తిక్షాలు ఒక్క‌ట‌య్యాయి. పోలింగ్ స్టేష‌న్ల‌కు చెందిన ఓటింగ్ రికార్డుల‌ను రిలీజ్ చేయాల‌ని ప‌శ్చిమ‌, లాటిన్ అమెరికా దేశాలు డిమాండ్ చేశాయి.

మాడురో ఎన్నిక‌ను అర్జెంటీనా వ్య‌తిరేకించింది. బ్యూన‌స్ ఎయిరిస్‌లో ఉన్న వెనిజులా దౌత్య‌వేత్త‌ల‌ను రీకాల్ చేసింది. చిలీ, కోస్టారికా, ప‌నామా, పెరూ, డామినిక‌న్ రిప‌బ్లిక్‌, ఉరుగ్వే దేశాల్లో ఉన్న వెనిజులా దౌత్య‌వేత్త‌ల‌ను వెన‌క్కి పిలిపించారు. ప‌నామా, డామినిక‌న్ రిప‌బ్లిక్ దేశాల‌కు వెళ్లాల్సిన విమానాల‌ను వెనిజులా ర‌ద్దు చేసింది.

Tags

Next Story