kuwait : ప్రేమకు సంకెళ్లు

kuwait : ప్రేమకు సంకెళ్లు
కువైత్, సౌదీలలో వాట్సాప్ హార్ట్ ఎమోజీ పంపితే అరెస్ట్…

ప్రస్తుతం యువత వాట్సాప్‌లోనే ఎక్కువగా మునిగిపోతున్నారు.…అసలు యువత ఏంటి అందరూ అందులోనే దిగి, మునిగి ఈత కొడుతున్నారు ఇక తమకు ఇష్టమైన వారికి హార్ట్ ఇమేజ్ పంపడం చాలా కామన్. దీనికి అమ్మాయిలు, అబ్బాయిలు అని ప్రత్యేకమైన తేడా ఏం లేదు.. కానీ అక్కడ అలా కాదు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో అమ్మాయిలకు హార్ట్ ఎమోజీని పంపిన వారు తీవ్రమైన శిక్షను ఎదుర్కొంటారని సౌదీ, కువైట్ మీడియా తాజాగా తెలిపింది.

కువైట్‌లో హార్ట్ ఎమోజీని పంపితే రెండేళ్ల వరకు జైలు శిక్ష, 2,000 కువైట్ దినార్ల (రూ.5,35,825) జరిమానా విధిస్తున్నారు. కువైట్‌తో పాటు, సౌదీ అరేబియాలో కూడా సోషల్ మీడియాలో హార్ట్ ఎమోజీని పంపడం అభ్యంతరకరం అని తెలుస్తోంది. ముఖ్యంగా సౌదీ లో రెడ్ హార్ట్ ని పంపితే జైలు శిక్ష విధిస్తారు. సౌదీ చట్టం ప్రకారం నేరం రుజువైతే రెండేళ్ల నుంచి ఐదేళ్ల వరకు జైలు శిక్ష విధిస్తారు. అదనంగా 100,000 సౌదీ రియాల్స్ (రూ.21,93,441) జరిమానా కూడా చెల్లించాల్సి ఉంటుంది.


గల్ఫ్ దేశాల్లో చట్టాలు ఎంత కఠినంగా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మన టైం బ్యాడ్ అయితే మనం చేసే చిన్న పని కూడా మనల్ని కటకటాల వెనక్కి నెడుతుంది. అందుకే గల్ఫ్ దేశాలకు వెళ్లేటప్పుడు అక్కడి చట్టాలు, నియమ నిబంధనలపై ఎంతోకొంత అవగాహన కలిగి ఉండటం చాలా అవసరం. ఈ విషయాన్ని కువైత్ న్యాయవాది హయా అల్ షలాహి ఒక మీడియా ఇంటర్వ్యూ లో ప్రకటించారు.

చాట్‌లో ఉపయోగించిన ఎమోజీలపై లేదా మాటలపై అయినా ఎవరైనా ఫిర్యాదు చేస్తే,.. దాన్ని వేధింపుల ఫిర్యాదులో చేర్చుతామని సౌదీ అరేబియా యాంటీ ఫ్రాడ్ అసోసియేషన్ సభ్యులు హెచ్చరించారు . ఇక చేసిన తప్పునే మళ్లీ చేసేవారికి సౌదీలో 300,000 సౌదీ రియాల్స్ అంటే రూ.65,80,324 జరిమానా విధిస్తారు. గరిష్టంగా ఐదేళ్ల వరకు జైలు శిక్ష కూడా విధించే అవకాశం ఉంది. సో.. ఈ రెండు దేశాలలో ఉండే ప్రవాసులు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండకపోతే భారీ మూల్యం చెల్లించుకోవాల్సిందే.

Tags

Read MoreRead Less
Next Story