UK: యూకే హోం కార్యదర్శిగా ముస్లిం మహిళ నియామకం

బ్రిటన్ రాజకీయాల్లో ఒక చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. దేశ హోం మంత్రి (హోం సెక్రటరీ) పదవిని తొలిసారిగా ఒక ముస్లిం మహిళ చేపట్టారు. పాకిస్థాన్ మూలాలున్న షబానా మహమూద్ ఈ కీలక బాధ్యతలను స్వీకరించి చరిత్ర సృష్టించారు.
ప్రధాని కీర్ స్టార్మర్ తన మంత్రివర్గంలో చేపట్టిన పునర్వ్యవస్థీకరణలో భాగంగా షబానాను ఈ పదవిలో నియమించారు. ఏంజెలా రేనర్ రాజీనామా అనంతరం య్వెట్ కూపర్ స్థానంలో ఆమె బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ నియామకంతో దేశ అంతర్గత భద్రత, వలస విధానాలు, పోలీసింగ్ వంటి అత్యంత కీలకమైన విభాగాలు షబానా పర్యవేక్షణలోకి వస్తాయి. ప్రస్తుతం దేశం అనేక సవాళ్లను ఎదుర్కొంటున్న తరుణంలో ఆమె నియామకం ప్రాధాన్యత సంతరించుకుంది.
షబానా తల్లిదండ్రులు పాకిస్థాన్ నుంచి యూకేకు వలస వచ్చారు. ఆమె 1980లో బర్మింగ్‌హామ్‌లో జన్మించారు. తన బాల్యాన్ని సౌదీ అరేబియాలో గడిపిన ఆమె, ఉన్నత విద్య కోసం తిరిగి యూకేకు వచ్చారు. ప్రఖ్యాత ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయంలో న్యాయశాస్త్రం అభ్యసించి, కొంతకాలం న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశారు.
2010లో బర్మింగ్‌హామ్ లేడీవుడ్ నియోజకవర్గం నుంచి లేబర్ పార్టీ తరఫున ఎంపీగా ఎన్నికయ్యారు. ఆ ఎన్నికల్లో గెలిచి యూకే పార్లమెంటులో అడుగుపెట్టిన తొలితరం ముస్లిం మహిళా ఎంపీలలో ఒకరిగా గుర్తింపు పొందారు. పార్టీలో పలు కీలక షాడో పదవులను నిర్వహించారు. 2024 ఎన్నికల్లో లేబర్ పార్టీ అధికారంలోకి వచ్చాక, ఆమెను న్యాయశాఖ కార్యదర్శిగా, లార్డ్ ఛాన్సలర్‌గా నియమించారు. ఆ హోదాలో జైళ్లలో రద్దీని తగ్గించడం, కోర్టు కేసులను త్వరితగతిన పరిష్కరించడం వంటి సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. ఆమె నియామకాన్ని పలువురు స్వాగతించారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com