Meloni: ట్రంప్ ఒక శాంతికర్త: షెహబాజ్ షరీఫ్

ఇజ్రాయెల్- హమాస్‌ల యుద్ధం ముగింపునకు సంబంధించి ఈజిప్టులోని షర్మ్- షేక్‌లో శాంతి ఒప్పందంపై దేశాధినేతలు సంతకాలు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌మాట్లాడుతూ.. ట్రంప్‌ను పొగడ్తలతో ముంచెత్తారు. ఆయనంత గొప్ప అధ్యక్షుడు లేడన్నట్లు వ్యాఖ్యలు చేశారు. షరీఫ్ మాటలకు ట్రంప్ ఉక్కిరిబిక్కిరి అయిపోయారు. చివరికి తాను మాట్లాడాల్సింది ఏమీ లేదంటూ చేతులెత్తేసి.. ఇంటికి వెళ్లిపోదామంటూ షరీఫ్‌తో చమత్కరించారు.
షెహబాజ్ మాట్లాడుతూ.. ‘ఈ రోజు చరిత్రలో గొప్ప రోజులలో ఒకటి. ఎందుకంటే అధ్యక్షుడు ట్రంప్‌నేతృత్వంలో అవిశ్రాంత ప్రయత్నాల తర్వాత గాజాలో శాంతి సాధన అయ్యింది. ఆయన నిజంగా శాంతిని కోరుకునేవాడు. ట్రంప్ ఈ ప్రపంచాన్ని శాంతి, శ్రేయస్సుతో జీవించేలా చేసేందుకు అవిశ్రాంతంగా కృషి చేశారు’ అని కొనియాడారు. ఈ సందర్భంగా భారత్- పాక్ మధ్య జరిగిన ఘర్షణను కూడా ట్రంపే ఆపారంటూ క్రెడిట్ ఇచ్చేశారు. ‘భారత్- పాక్ మధ్య యుద్ధాన్ని ఆపడంతో పాటు కాల్పుల విరమణ సాధించడానికి ట్రంప్ అసాధారణ ప్రయత్నాలు చేశారు. భారత్- పాక్‌రెండూ అణ్వాస్త్ర శక్తులు. ఆ నాలుగు రోజుల్లో ట్రంప్, ఆయన అద్భుతమైన బృందంతో జోక్యం చేసుకోకపోతే.. ఆ ఘర్షణలు పశ్చిమాసియాకు విస్తరించి ఉండేవి. ఏం జరిగిందో చెప్పేందుకు కూడా ఎవరూ మిగిలేవారు కాదు.
ఇందుకుగాను నోబెల్ శాంతి బహుమతికి పాక్ ఆయన్ను నామినేట్ చేసింది. ఇది అందుకునేందుకు ఆయన అర్హుడు. ఇప్పటివరకు ఏడు యుద్ధాలు ఆపారు. ఇది ఎనిమిదవది’ అంటూ షరీఫ్ తన ప్రసంగాన్ని ముగించారు. షరీఫ్ ప్రసంగం నేపథ్యంలో అక్కడే ఉన్న ఇటలీ ప్రధాని జార్జియా మెలోని నోటిమీద చేయి వేసుకొని చూస్తూ ఉండిపోయారు. షరీఫ్ ప్రసంగం అనంతరం ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. షరీఫ్ ప్రశంసలతో ఉబ్బితబ్బిబ్బయిన ట్రంప్.. ఇది తాను ఊహించలేదన్నారు. ఇంకా తాను మాట్లాడేందుకు ఏమీ లేదంటూ.. ఇంటికి వెళ్దాం అంటూ చమత్కరించారు. దీంతో ఆ ప్రాంగణం మొత్తం నవ్వులు విరిశాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com