Sheikh Hasina: నన్ను హత్య చేసేందుకు కుట్రలు చేశారు: షేక్ హసీనా

బంగ్లాదేశ్ లో పరిస్థితులు నానాటికీ దిగజారుతున్నాయి. హిందువులు, మైనార్టీలపై అక్కడ జరుగుతున్న దాడులపై ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో భారత్ లో ఒక రహస్య ప్రదేశంలో ఆశ్రయం పొందుతున్న బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా కీలక వ్యాఖ్యలు చేశారు.
దేశంలో నెలకొన్న అనిశ్చితికి తాత్కాలిక ప్రధాని మహమ్మద్ యూనస్ కారణమని ఆమె అన్నారు. మూక హత్యలకు కారణమయ్యానంటూ తనపై కేసులు పెడుతున్నారని... వాస్తవానికి విద్యార్థి సంఘాల నాయకులతో కలిసి ఆందోళనలకు కుట్ర పన్నింది యూనస్ అని చెప్పారు. ఇప్పుడు బంగ్లాదేశ్ లో ఉపాధ్యాయులు, పోలీసులు ఇలా అందరిపై దాడులు జరుగుతున్నాయని అన్నారు. మైనార్టీలను లక్ష్యంగా చేసుకుని ఆలయాలపై దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. అల్లర్ల వెనకున్న మాస్టర్ మైండ్ యూనసేనని చెప్పారు.
తన తండ్రి మాదిరే తనను కూడా హత్య చేసేందుకు ఎన్నో కుట్రలు జరిగాయని హసీనా తెలిపారు. వాటిని ఎదుర్కోవడానికి తనకు అరగంట సమయం కూడా పట్టదని... తన భద్రతా సిబ్బంది కాల్పులు జరిపి ఉంటే ఎంతో మంది ప్రాణాలు కోల్పోయేవారని చెప్పారు. అధికారం కోసం తాను అక్కడే ఉంటే మారణహోమం జరిగేదని అన్నారు. ప్రజలను విచక్షణారహితంగా చంపేస్తుండటంతోనే తాను దేశం విడిచి వెళ్లాలనే నిర్ణయం తీసుకున్నానని చెప్పారు. ఆందోళనకారులపై కాల్పులు జరపవద్దని తన భద్రతా సిబ్బందికి చెప్పానని తెలిపారు.
షేక్ హసీనాకు చెందిన అవామీ లీగ్ పార్టీ కార్యక్రమం న్యూయార్క్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి ఆమె వర్చువల్ గా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com