HASINA: అంతా అగ్రరాజ్యం కుట్ర

బంగ్లాదేశ్‌లో హింసాత్మక అల్లర్ల వెనుక అగ్రరాజ్యం అమెరికా హస్తం ఉన్నదని మాజీ ప్రధాని షేక్ హసీనా చేసిన ఆరోపణలు సంచలనంగా మారాయి. తనకు వ్యతిరేకంగా అమెరికా కుట్ర చేసిందని, సెయింట్ మార్టిన్స్ ద్వీపం కోసమే ఇదంతా చేసిందని వెల్లడించారు. తాను గనుక వ్యూహాత్మకమైన సెయింట్ ద్వీపాన్ని అమెరికాకు అప్పగించి ఉంటే.. తన ప్రభుత్వం కొనసాగేదని పేర్కొన్నారు. రిజర్వేషన్ల వ్యతిరేక ఆందోళనలు, అల్లర్ల నేపథ్యంలో బంగ్లాదేశ్ ప్రధానిగా రాజీనామా చేయకముందు, భారత్‌కు రాకముందు షేక్ హసీనా జాతినుద్దేశించి మాట్లాడాలనుకొన్నారు. కానీ అమె ప్రభుత్వానికి వ్యతిరేకంగా హింసాత్మక ఆందోళనలు కొనసాగుతున్న క్రమంలో సైనిక ఉన్నతాధికారులు అందుకు అనుమతించలేదు. ఆమె జాతినుద్దేశించి చేయాల్సిన ప్రసంగం తాజాగా బయటకు వచ్చిందని మీడియా కథనాలు పేర్కొన్నాయి.
ఈ వార్తలను హసీనా కుమారుడు సాజీద్ వాజెబ్ ఖండించారు. అవి పూర్తిగా కల్పితమని, తప్పు అని పోస్టులో పేర్కొన్నారు. ఢాకాను వీడేముందు, తర్వాత ఏ విధమైన ప్రకటన ఇవ్వలేదని తన తల్లి హసీనా ఇవ్వలేదని స్పష్టం చేశారు. తాను మాట్లాడాలనుకొన్న అంశాల గురించి హసీనా తన సన్నిహితులతో చెప్పారని, ఆమె మాట్లాడలేకపోయిన తన ప్రసంగం బయటకొచ్చిందని పలు మీడియా సంస్థలు కథనాలు ఇచ్చాయి. బంగ్లాదేశ్‌లో ప్రభుత్వ మార్పునకు అమెరికా కుట్ర చేసిందని ఆరోపించారు. శవాల ఊరేగింపును తాను చూడాలనుకోలేదని... విద్యార్థుల మృతదేహాలపై నడుచుకుంటూ అధికారంలోకి రావాలని వాళ్లు అనుకొన్నారని హసీనా అన్నారు. అయితే తాను దానికి అనుమతించలేదని... ప్రధాని పదవికి రాజీనామా చేశానని తేల్చి చెప్పారు. సెయింట్ మార్టిన్ ద్వీపం సార్వభౌమాధికారాన్ని గనుక అమెరికాకు అప్పగించి ఉంటే, బంగాళాఖాతంపై ఆ దేశానికి పట్టు కల్పించి ఉంటే తాను అధికారంలో కొనసాగేదాన్ని నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. దయచేసి అతివాదుల మాయలో పడొద్దని దేశ ప్రజలను కోరుతున్నానని హసీనా పేర్కొన్నారు. తాను దేశంలోనే ఉంటే మరిన్ని ప్రాణాలను కోల్పోవాల్సి వస్తుందని, అందుకే తాను పదవి నుంచి దిగిపోతున్నానని అన్నారు.
జాతినుద్దేశించి చేయలేకపోయిన ప్రసంగంలో హసీనా తన పార్టీ నేతలు, కార్యకర్తలకు కూడా సందేశం ఇచ్చారు. అవామీ లీగ్ పార్టీ తిరిగి నిలబడుతుందని, ఆశ కోల్పోవద్దని, తాను త్వరలో దేశానికి తిరిగి వస్తానని పేర్కొన్నారు. అవామీ లీగ్ పార్టీ నేతలను లక్ష్యంగా చేసుకోవడం తనకు చాలా బాధగా ఉందన్నారు. ఆందోళనలు చేస్తున్న విద్యార్థులను తాను రజాకార్లు అని పిలువలేదని ఈ సందర్భంగా ఆమె వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com