Japan: జపాన్ ప్రధాని పదవికి రాజీనామా చేసే యోచనలో ఇషిబా!

జపాన్ ప్రధాని పదవికి షిగేరు ఇషిబా రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. పార్లమెంటరీ ఎన్నికల తర్వాత పార్టీలో వచ్చిన అంతర్గత విభేదాలకు స్వస్తి పలకాలనే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఆదివారం జపాన్ టీవీ ఎన్‌హెచ్‌కే వెల్లడించింది.
జపాన్ ప్రధానమంత్రి షిగేరు ఇషిబా నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం పార్లమెంటు ఎగువసభలో మెజారిటీ కోల్పోయింది. సభలో 248 స్థానాలుండగా, వాటిలో సగం సీట్లకు జులైలో ఎన్నికలు జరిగాయి. అధికార లిబరల్ డెమోక్రటిక్ పార్టీ (ఎల్‌డీపీ) సభలో మెజారిటీ సాధించాలంటే 50 స్థానాలు దక్కించుకోవాలి. కానీ 47 స్థానాలకే పరిమితమైంది. గత అక్టోబరులో జరిగిన దిగువసభ ఎన్నికల్లోనూ ఈ కూటమి ఓటమి పాలైంది. 1955లో స్థాపించిన ఎల్‌డీపీ రెండు సభల్లో మెజారిటీని కోల్పోవడం ఇదే తొలిసారి. ప్రతికూలంగా ఫలితాలొచ్చినా తాను పదవిలో కొనసాగుతానని ఇషిబా తెలిపారు.
షిగేరు ఇషిబా మొదట బ్యాంకింగ్ రంగంలో పనిచేశారు. తన 29 ఏళ్ల వయసులో అనగా 1986లో రాజకీయాల్లో అడుగుపెట్టారు. అప్పట్లో ప్రభుత్వ విధానాలను బహిరంగంగా వ్యతిరేకిస్తూ తరచూ వార్తల్లో నిలిచేవారు. ఈ క్రమంలో కిషిద ప్రభుత్వంలో ఆయనను పక్కనబెట్టారు. గత ఎల్‌డీపీ ప్రభుత్వంలో రక్షణశాఖ మంత్రిగా పనిచేశారు. పార్టీ అధ్యక్ష పదవికి ఆయన ఐదు సార్లు పోటీపడ్డారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com