MANIPUR: మణిపుర్ ఘటనపై అమెరికా దిగ్భ్రాంతి

దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన మణిపుర్(Manipur) అమానవీయ ఘటనపై అమెరికా విదేశాంగ శాఖ స్పందించింది. మణిపుర్‌లో ఇటీవల వెలుగులోకి వచ్చిన వీడియో(Manipur Video)పై అమెరికా(USA) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. మణిపుర్ ఘర్షణలపై అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి వేదాంత్ పటేల్(Vedant Patel) ఆవేదన వ్యక్తం చేశారు.
మణిపుర్‌లో ఇద్దరు మహిళలపై చోటుచేసుకున్న విపరీత ప్రవర్తనకు సంబంధించిన వీడియో మమ్మల్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని వేదాంత్ పటేల్(Vedant Patel) అన్నారు. ఈ ఘటన బాధితులకు మేం ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నామని అన్నారు. అలాగే వారికి న్యాయం చేయడం కోసం భారత ప్రభుత్వం( Indian government) చేస్తున్న ప్రయత్నాలకు తాము మద్దతుగా నిలుస్తామని వేదాంత్ పటేల్ విలేకరుల సమావేశంలో ఓ జర్నలిస్టు ప్రశ్నకు సమాధానం ఇచ్చారు.
ఏ నాగరిక సమాజంలో అయినా మహిళలపై జరిగే ఈ తరహా హింస తీవ్ర అవమానకరమని అంటూ ప్రధాని మోదీ(Prime Minister Narendra Modi) నుంచి వచ్చిన స్పందనను ప్రస్తావించారు. అలాగే మణిపుర్(Manipur)లో ఆమోదయోగ్యమైన, శాంతియుత పరిష్కారం కోసం చేసే ప్రయత్నాలకు అమెరికా(USA) మద్దుతుగా ఉంటుందన్నారు.
కొద్దిరోజుల క్రితం భారత్‌లోని అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టి కూడా మణిపుర్(Manipur)లో కొనసాగుతోన్న హింసపై ఆందోళన వ్యక్తం చేశారు. దీన్ని నిలువరించే విషయంలో భారత్ కోరితే సాయం చేయడానికి అమెరికా సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్న సంగతి తెలిసిందే. మే నెల ప్రారంభం నుంచి ఈశాన్యరాష్ట్రంలో జాతుల మధ్య వైరం కొనసాగుతోంది. రోజుల్లో అది తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. ఇటీవల కాలంలో అక్కడ జరిగిన దారుణాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి రావడం కలవరపెడుతోంది.
మరోవైపు మహిళలు, చిన్నారులు సహా 718 మంది మయన్మార్ వాసులు రెండ్రోజుల వ్యవధిలో మణిపుర్‌లోకి అక్రమంగా ప్రవేశించినట్లు బయటపడింది. సరైన ప్రయాణ పత్రాలు లేకుండా చందేల్ జిల్లాలోకి వీరు వచ్చారు. మణిపుర్‌లో ఆందోళనకారులకు మయన్మార్ నుంచి ఆయుధాలు సరఫరా అవుతున్నట్లు గతనెలలో నిఘావర్గాలు గుర్తించాయి. మరోవైపు మణిపుర్‌లో మూడు నెలలుగా బ్రాడ్‌బ్యాండ్ సేవలపై ఉన్న నిషేధాన్ని కొన్ని షరతులతో పాక్షికంగా ఎత్తివేశారు. మొబైల్ ఫోన్లలో అంతర్జాలంపై ఆంక్షలు కొనసాగుతాయి. మహిళల్ని నగ్నంగా ఊరేగించిన ఘటనలో మరోవ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com