USA: ఐదుగురిని కాల్చిచంపి హంతకుడి ఆత్మహత్య..
అగ్రరాజ్యం అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం రేగింది. లాస్ వెగాస్‌లోని రెండు అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌లలో ఓ వ్యక్తి కాల్పులు పాల్పడ్డాడు. ఈ కాల్పుల్లో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. చనిపోయిన వారిలో నలుగురు మహిళలు ఉన్నారు. వారిలో 13 ఏళ్ల బాలిక కూడా ఉంది. ఈ దారుణానికి ఒడిగట్టిన నిందితుడు 47 ఏళ్ల ఎరిక్ ఆడమ్స్‌గా పోలీసులు గుర్తించారు. అయితే ఐదుగురిని కాల్చి చంపిన కొన్ని గంటల తర్వాత నిందితుడు తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు తెలిపారు. ఒకే కాంప్లెక్స్‌లోని రెండు వేర్వేరు అపార్ట్‌మెంట్లలో అడమ్స్ కాల్పులు జరిపాడు. కాల్పులకు గల కారణాలను పోలీసులు వెల్లడించలేదు.
నార్త్ లాస్ వెగాస్‌లోని ఒక అపార్ట్‌మెంట్‌లో సోమవారం పొద్దుపోయాక కాల్పులు జరిగినట్లు సమాచారం రావడంతో స్పందించామని అధికారులు వివరించారు. ఇద్దరు మహిళల మృతదేహాలను గుర్తించామని, ఒకరి వయసు 40 ఏళ్లు, మరొకరి వయసు 50 ఏళ్లు అని పేర్కొన్నారు. అదే అపార్ట్‌మెంట్‌లో తీవ్రంగా గాయపడిన 13 ఏళ్ల బాలికను కూడా గుర్తించి హాస్పిటల్‌కు తరలించామని చెప్పారు. ఈ అపార్ట్‌మెంట్‌కు సమీపంలోనే మరికొంత మంది బాధితులకు సంబంధించిన సమాచారం అందిందని చెప్పారు. దర్యాప్తు చేస్తుండగా మరో ఇద్దరు మహిళలు, ఒక పురుషుడి మృతదేహాలను గుర్తించామని చెప్పారు. మృతులంతా తుపాకీ గాయాలతో చనిపోయారని లాస్ వెగాస్ పోలీసులు వివరించారు.
కాగా నిందితుడు ఆడమ్స్ కోసం పోలీసులు రాత్రిపూట వేట కొనసాగించారు. కచ్చితమైన సమాచారం ఉండడంతో అక్కడికి వెళ్లి లొంగిపోవాలని కోరారు. అయితే పోలీసులు సమీపిస్తున్న సమయంలో తుపాకీతో తనను తాను కాల్చుకొని చనిపోయాడని పోలీసు అధికారులు వివరించారు. ఈ కాల్పులకు కారణాలను తెలుసుకునేందుకు దర్యాప్తు జరుపుతున్నామని పోలీసులు తెలిపారు. ఆడమ్స్ బంధువులను సంప్రదించేందుకు ప్రయత్నించగా ఎవరూ అందుబాటులోకి రాలేదని చెప్పారు. కాగా గత కొన్ని రోజులుగా అమెరికాలో వరుసగా చోటుచేసుకుంటున్న కాల్పుల ఘటనలు అక్కడి ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. రోడ్లపై, కిరాణా దుకాణాలపై ఇలా ఎక్కడ పడితే అక్కడ దొంగలు, సైకోలు కాల్పులు జరుపుతున్నారు. ఈ కాల్పుల్లో పలువురు ప్రాణాలు కోల్పోతున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com