Singer Zubeen Garg: జుబీన్ గార్గ్ అంత్యక్రియలు పూర్తి..

Singer Zubeen Garg: జుబీన్ గార్గ్ అంత్యక్రియలు పూర్తి..
X
వేలాదిగా తరలివచ్చిన అభిమానులు

ప్రముఖ అస్సామీ గాయకుడు జుబీన్ గార్గ్ అంత్యక్రియలు పూర్తయ్యాయి. గౌహతిలో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. అంత్యక్రియలు జరుగుతుంటుండగా భార్య గరిమా సైకియా గార్గ్ ఏడుస్తూనే కనిపించారు. అస్సామీ మహిళలు ధరించే సాంప్రదాయ దుస్తులైన మేఖేలా చాదర్ ధరించారు. చితికి మంటలు అంటుకుంటున్న సమయంలో రెండు చేతులు జోడించారు. ఎక్కి.. ఎక్కి ఏడుస్తూనే కనిపించారు. పలువురు ఆమెను ఓదార్చుతూ కనిపించారు.

జుబీన్ గార్గ్ అంత్యక్రియలకు కేంద్ర మంత్రులు సర్బానంద సోనోవాల్, కిరన్ రిజిజు, పబిత్రా మార్గరీటా, అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ, అసెంబ్లీ స్పీకర్ బిశ్వజిత్ డైమరీ, పలువురు కేబినెట్ మంత్రులు, సీనియర్ ప్రభుత్వ అధికారులు హాజరై శవపేటికపై పూల మాలలు వేసి నివాళులర్పించారు. సోనోవాల్, మార్గరీటా, హిమంత బిస్వా శర్మ, ప్రతిపక్ష నాయకుడు దేబబ్రత సైకియా మోకాళ్లపై నిలబడి నివాళులర్పించారు.

జుబీన్ గార్గ్ గౌరవార్థం రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థలు మూసివేశారు. అలాగే ప్రభుత్వ కార్యాలయాలు కూడా మూసేశారు. ఇక కడసారి చూపు కోసం వేలాది మంది అభిమానులు, ప్రజలు అంత్యక్రియలకు తరలివచ్చారు. ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా భారీ ఎత్తున పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.

జుబీన్ గార్గ్ సింగపూర్‌లో జరిగే నార్త్ ఈస్ట్ ఇండియా ఫెస్టివల్‌కు హాజరయ్యేందుకు వెళ్లారు. ఈ క్రమంలో శుక్రవారం (సెప్టెంబర్ 19) బోటుపై షికారు చేస్తుండగా ప్రాణాలు కోల్పోయారు. బోటులోంచి లైఫ్ జాకెట్ ధరించి నీళ్లల్లోకి దూకి ఈత కొట్టడం ప్రారంభించారు. కానీ శ్వాస తీసుకోవడంలో ఇబ్బందికి గురైనట్లు కనిపించారు. కొద్దిసేపటికే ఆయన స్పృహ కోల్పోయారు. కొద్దిసేపు నీళ్లలోనే శవంలా ఉండిపోయారు. అనంతరం సహచరులు ఆస్పత్రికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకుండా పోయింది. చికిత్స పొందుతూ మృతిచెందారు.

Next Story