Israel Hamas Conflict: స్వల్ప విరామాలకు ఇజ్రాయెల్‌ యోచన

Israel Hamas Conflict:  స్వల్ప విరామాలకు ఇజ్రాయెల్‌ యోచన
X
పూర్తిస్థాయి కాల్పుల విరమణకు ససేమిరా

గాజాపై దాడులు.. స్వల్ప విరామాలకు ఇజ్రాయెల్‌ యోచన ప్రకటించేందుకు అంగీకరించింది. మానవతా సాయం లోపలికి రావటానికి, బందీలు గాజాను వీడటానికి వీలుగా పరిస్థితుల ఆధారంగా నిర్ణయాలు ఉంటాయని తెలిపింది. అయితే అంతర్జాతీయంగా ఒత్తిడి పెరిగినప్పటికీ....పూర్తిస్థాయి కాల్పుల విరమణకు ఇజ్రాయెల్‌ ససేమిరా అంటోంది. కాల్పుల విరమణను హమాస్‌ అనుకూలంగా మార్చుకుని తిరిగి బలపడే ప్రమాదం ఉందని ఇజ్రాయెల్‌ తోపాటు అమెరికా కూడా అనుమానిస్తోంది.

హమాస్‌ను భూస్థాపితం చేసేవరకు గాజాపై దాడులు ఆగవన్న ఇజ్రాయెల్. ప్రదేశాల వారీగా స్వల్ప సడలింపులు ఇచ్చేందుకు మాత్రం ముందుకువచ్చింది. మానవతా సాయాన్ని సులభతరం చేయడానికి, బందీల నిష్క్రమణకు వీలుగా వ్యూహాత్మకంగా స్వల్ప విరామాలను పరిశీలిస్తున్నట్లు ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహు తెలిపారు. గాజాపై....తమ దేశం చేస్తున్న యుద్ధానికి సాధారణ కాల్పుల విరమణ ఆటంకం కలిగిస్తుందని ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహు తెలిపారు. పూర్తి స్థాయి కాల్పుల విరమణను హమాస్‌ అనుకూలంగా మార్చుకొని తిరిగి బలపడే ప్రమాదం ఉందని అమెరికా కూడా భావిస్తోంది. అయితే మానవతా కారణాలతో ప్రదేశాలవారీగా దాడులకు స్వల్ప విరామం ప్రకటించే విషయాన్ని పరిస్థితుల ఆధారంగా నిర్ణయం తీసుకుంటామని ఇజ్రాయెల్‌ ప్రధాని చెప్పారు. వ్యూహాత్మక దాడులకు స్వల్ప విరామాలను ఇక్కడ ఒకగంట, అక్కడ ఒకగంట ఇప్పటికే అమలుచేస్తున్నట్లు తెలిపారు. మానవతాసాయం గాజా లోపలికి రావడానికి లేదా తమ దేశ బందీలు, విదేశీ బందీలు గాజావీడటానికి వీలుగా పరిస్థితుల ఆధారంగా నిర్ణయాలు ఉంటాయని చెప్పారు. యుద్ధం ముగిసిన తర్వాత కూడా గాజాలో సుదీర్ఘకాలం భద్రతను తామే పర్యవేక్షించాల్సి ఉంటుందన్న నెతన్యాహు.... ఇంతకాలం పట్టించుకోకపోవటమే ప్రస్తుత పరిస్థితులకు కారణమని అంటున్నారు.


సరిగ్గా నెలరోజులక్రితం హమాస్‌ జరిపిన మెరుపుదాడిలో 1400మంది ఇజ్రాయెల్‌ ప్రజలు మృతి చెందగా 240మందిని బందీలుగా తీసుకెళ్లారు. అప్పటినుంచి గాజాస్ట్రిప్‌పై ఇజ్రాయెల్‌ పెద్దఎత్తున వైమానిక, భూతల దాడులుచేస్తోంది. ఇప్పటివరకు ఇజ్రాయెల్‌ జరుపుతున్న దాడుల్లో 4వేల మంది చిన్నారులుసహా పది వేలమందికిపైగా పాలస్తీనా ప్రజలు చనిపోయినట్లు గాజా వైద్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. అంతర్జాతీయంగా ఒత్తిడి పెరిగినా, కాల్పుల విరమణకు ఇజ్రాయెల్‌, హమాస్‌లు తిరస్కరిస్తున్నాయి. ముందు బందీలుగా ఉన్న తమ పౌరులను విడుదల చేయాలని ఇజ్రాయెల్‌ డిమాండ్‌ చేస్తుండగా గాజాపై దాడులు కొనసాగినంతకాలం బందీలను విడిచిపెట్టడం లేదా దాడులు ఆపేదిలేదని హమాస్‌ కూడా తెగేసి చెబుతోంది.


Tags

Next Story