Solo Wedding: సరికొత్త ట్రెండ్ – సోలో వెడ్డింగ్.. పెళ్ళికొడుకుతో పన్లేదు..

Solo Wedding: సరికొత్త ట్రెండ్ – సోలో వెడ్డింగ్.. పెళ్ళికొడుకుతో పన్లేదు..
Solo Wedding: బాయ్ ఫ్రెండ్ తో తలనొప్పులు.. సహజీవనంతో సమస్యలు.. సోలో బ్రతుకే సో బెటరు..

Solo Wedding: ముప్పైఏళ్లొచ్చాయి.. మూడు ముళ్ల యోగ్యత లేదా.. ఇరుగు, పొరుగు మాటలు.. ఇంట్లో వాళ్ల సతాయింపులు.. పెళ్లి పేరు చెబితేనే భయం వేస్తుంది. ఆ వచ్చేవాడు ఎలా ఉంటాడో.. ఏం ఇబ్బందులు పెడతాడో అని పెళ్లిని వాయిదా వేస్తుంటారు మరి కొందరు.. కొంత మంది వివాహ బంధం మూణ్ణాళ్ల ముచ్చట అవుతుంది. బాయ్ ఫ్రెండ్ తో తలనొప్పులు.. సహజీవనంతో సమస్యలు.. సోలో బ్రతుకే సో బెటరు అని వెడ్డింగ్ ని వరుడు లేకుండా కానిచ్చేస్తున్నారు జపనీస్ అమ్మాయిలు.

జపాన్ లో పదేళ్ల క్రితం మొదలైన సోలో వెడ్డింగ్ ట్రెండ్ పక్క దేశాలకూ పాకుతోంది. ఈ పెళ్లిలో వధువు, బంధువులు, వేడుకలు, పురోహితులు, ఫోటోషూట్, కమ్మని భోజనం, అన్నీ ఉంటాయి.. ఒక్క వరుడు మాత్రం ఉండడు. ఆఖరికి వెడ్డింగ్ రింగ్ కూడా ఉంటుంది.. అయితే దాన్ని తనకు తానే పెట్టుకుంటుంది వధువు. తనని తాను ప్రేమించుకుంటున్నానని, జీవితాంతం ఒంటరిగా ఉంటానని ప్రమాణం చేస్తూ పెళ్లి ఉంగరాన్ని తనే పెట్టుకుంటుంది. ఇదేదో బావుందని ఇటలీ, ఆస్ట్రేలియా, తైవాన్, అమెరికాల్లోనూ ఈ ట్రెండ్ కొనసాగుతోంది.

సోలో వెడ్డింగ్ కి ఈవెంట్ ప్లానర్లు కూడా రెడీగా ఉంటారు. వరుడు లేడన్నమాటే కానీ పెళ్లంటే బోలెడు పనులు.. ఇవన్నీ ఒక్కరే ఏంచేసుకుంటారు.. అలా మీరు ఫోన్ కొడితే చాలు.. ఇలా వచ్చి మీ పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లన్నీ మేం చేసేస్తాంగా అంటున్నారు సోలో వెడ్డింగ్ ఈవెంట్ మ్యానేజర్లు. 2014లో క్యోటోలో సెరెకా ట్రావెల్స్ సంస్థ సోలో వెడ్డింగ్ కి ప్రత్యేక పాకేజీలు ప్రారంభించింది. దాంతో ఇది మరింత పాపులరైంది.

జీవితంలో ఒకే ఒక్కసారి చేసుకునే పెళ్లి వేడుక.. ఒక తీయని గుర్తుగా మిగిలిపోవాలంటే.. చక్కని ఫోటోషూట్ లు, వీడియోలు, దేవకన్యలా ముస్తాబు చేసే బ్యూటీషియన్ అన్నీ అమర్చేస్తారు ఈ ప్యాకేజీలో ఈవెంట్ మ్యానేజర్లు.. సెరెకా సంస్థ తక్కువ కాలంలోనే 130కి పైగా ఈవెంట్ లను నిర్వహించింది. ముందు ముందు ఈ కల్చర్ మరింత ఎక్కువగా ఉన్నా ఆశ్చర్యపోనక్కరలేందంటోంది సెరెకా సంస్థ. అన్నట్లు సోలో వెడ్డింగ్ ఖర్చుకూడా సింపులే .. రెండు లక్షల్లో అయిపోతుంది.

Tags

Read MoreRead Less
Next Story