South Africa: దక్షిణాఫ్రికాలో కుప్పకూలిన హిందూ ఆలయం..

దక్షిణాఫ్రికాలో ఘోర విషాదం చోటుచేసుకుంది. క్వాజులు-నాటల్ ప్రావిన్స్‌లో నిర్మాణంలో ఉన్న నాలుగు అంతస్తుల హిందూ దేవాలయం కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో భారత సంతతికి చెందిన వ్యక్తి సహా నలుగురు ప్రాణాలు కోల్పోయారు. శిథిలాల కింద మరికొందరు చిక్కుకున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు.
డర్బన్‌కు ఉత్తరాన ఉన్న రెడ్‌క్లిఫ్ ప్రాంతంలో 'న్యూ అహోబిలం టెంపుల్ ఆఫ్ ప్రొటెక్షన్' పేరుతో ఈ ఆలయ నిర్మాణం జరుగుతోంది. శుక్రవారం కార్మికులు పనుల్లో నిమగ్నమై ఉండగా.. భవనంలోని ఒక భాగం ఒక్కసారిగా కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఆలయ ట్రస్ట్ కార్యవర్గ సభ్యుడు, నిర్మాణ ప్రాజెక్టు మేనేజర్ అయిన విక్కీ జైరాజ్ పాండే (52) మరణించినట్లు అధికారులు గుర్తించారు. ఆలయ ప్రారంభం నుంచి ఆయన నిర్మాణ పనులను దగ్గరుండి చూసుకుంటున్నారు.
ఈ ఘటనలో మొత్తం నలుగురు మరణించినట్లు శనివారం అధికారులు ధ్రువీకరించారు. అయితే, ఈ ఆలయ నిర్మాణానికి తమ నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోలేదని స్థానిక ఇథెక్విని మున్సిపాలిటీ ఒక ప్రకటనలో పేర్కొంది. దీంతో ఇది అక్రమ నిర్మాణం అనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ప్రమాదం జరిగిన వెంటనే సహాయక బృందాలు రంగంలోకి దిగాయి. శిథిలాల కింద చిక్కుకున్న వారిలో ఒకరి నుంచి మొదట ఫోన్ కాల్స్ వచ్చినా, ఆ తర్వాత సంబంధాలు తెగిపోయాయి. ప్రతికూల వాతావరణం కారణంగా శనివారం మధ్యాహ్నం సహాయక చర్యలను తాత్కాలికంగా నిలిపివేశారు. ప్రాణాలతో ఎవరైనా బయటపడే అవకాశాలు తక్కువని నిపుణులు భావిస్తున్నప్పటికీ, అవసరమైనంత కాలం సహాయక చర్యలు కొనసాగిస్తామని స్థానిక మంత్రి హామీ ఇచ్చారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

