China:చైనా బెదిరింపులకు తగ్గని ఫిలిప్పీన్స్

దక్షిణ చైనా సముద్రంలో ఉన్న తమ సైనిక ఔట్ పోస్టును చైనాకు అప్పగించబోమని ఫిలిప్పీన్స్ తేల్చిచెప్పింది. సెకండ్ థామస్ షోల్ స్థావరానికి అతిసమీపంలో ఇటీవల ఫిలిప్పీన్స్ నౌకలపై చైనా కోస్టుగార్డు సిబ్బంది దాడికి దిగిన వేళ ఫిలిప్పీన్స్ ఈ వ్యాఖ్యలు చేసింది. ఆ ఘటనలో ఏకంగా ఫిలిప్పీన్స్ నౌకాదళ వైస్ అడ్మిరల్ అల్బర్టో కార్లోస్ కూడా గాయపడ్డట్లు తెలిసింది.దక్షిణ చైనా సముద్రంలోని వివాదాస్పద జలాల్లో ఉన్న సెకండ్ థామస్ షోల్ సైనిక ఔట్ పోస్టును చైనాకు అప్పగించేది లేదని ఫిలిప్పీన్స్ తేల్చిచెప్పింది. ఇటీవల ఫిలిప్పీన్స్‌బోట్లపై చైనా కోస్టుగార్డు సిబ్బంది దాడి చేసిన తర్వాత.. ఆ దేశం ఈ మేరకు స్పష్టం చేసింది. ఆ ఘటనకు సంబంధించిన మరికొన్ని దృశ్యాలను ఫిలిప్పీన్స్ తీరరక్షక దళం విడుదల చేసింది. ఆ ఘటనలో ఫిలిప్పీన్స్ నౌకాదళ వైస్ అడ్మిరల్ అల్బర్టో కార్లోస్‌కు కూడా గాయాలు అయినట్లు పేర్కొంది.
గస్తీ నిర్వహిస్తున్న ఫిలిప్పీన్స్ నౌకలకు అతి సమీపానికి వెళ్లిన.. రెండు చైనీస్ కోస్టుగార్డు నౌకలు వాటిపై జలఫిరంగులు ప్రయోగించాయి. వాటికి సంబంధించిన మరిన్ని దృశ్యాలను ఫిలిప్పీన్స్ విడుదల చేసింది. అల్బర్టోకార్లోస్ ఉన్న బోటుపైనా జల ఫిరంగుల దాడి జరిగినట్లు తెలిపింది. ఆ తాకిడికి బోటు విండ్‌షీల్డ్ అద్దాలు పగిలి.. గాజు ముక్కలు తగిలి వైస్ అడ్మిరల్ సహా నలుగురు నావికులకు స్వల్ప గాయాలైనట్లు పేర్కొంది. డ్రాగన్ ఆగడాలు భరించలేక ఫిలిప్పీన్స్ సిబ్బంది బోటులోని హల్‌లో దాక్కొవాల్సి వచ్చిందని వెల్లడించింది.
సెకండ్ థామస్ షోల్‌ను తమదంటే తమదని ఫిలిప్పీన్స్, చైనాలు వాదిస్తున్నాయి. ఈ ప్రాంతం ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాకు 200 కిలోమీటర్ల దూరంలో.. చైనా ప్రధాన భూభాగానికి వెయ్యి కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.
రెండు రోజుల క్రితం ఫిలిప్పీన్స్, చైనాకు చెందిన రెండు కోస్ట్‌గార్డు నౌకలు ఢీకొనడంతో దక్షిణ చైనా సముద్రంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఫిలిప్పీన్స్ నౌక స్పల్పంగా దెబ్బతింది. బీజింగ్‌కు చెందిన భారీ నౌక తమ సరుకుల నౌకను సెకండ్ థామస్ షౌల్ వద్ద అడ్డుకుందని ఫిలిప్పీస్స్ కోస్ట్‌గార్డు ప్రతినిధి ఆరోపించారు. చైనా నౌకలు తమపై జల ఫిరంగులు కూడా ప్రయోగించాయన్నారు. మనీలా నౌకలు తమ జలాల్లోకి ప్రవేశించడంతో వాటిని నియంత్రించే చర్యలు మాత్రమే చేపట్టామని చైనా తన చర్యను సమర్థించుకుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com