Omicron : దక్షిణకొరియాలో ఒమిక్రాన్‌ కలవరం.. ఊహించని రీతిలో పెరుగుతున్న కేసులు

Omicron :  దక్షిణకొరియాలో ఒమిక్రాన్‌ కలవరం.. ఊహించని రీతిలో పెరుగుతున్న కేసులు
Omicron : దక్షిణ కొరియాను ఒమిక్రాన్ కలవరపెడుతోంది. ఊహించని స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి.

Omicron : దక్షిణ కొరియాను ఒమిక్రాన్ కలవరపెడుతోంది. ఊహించని స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. బుధవారం ఒక్కరోజే దాదాపు 6 లక్షలకు పైగా కరోనా కొత్త కేసులు నిర్ధారించారు. రోజు వ్యవధిలోనే కేసుల సంఖ్య దాదాపు 55 శాతం పెరిగిందని సౌత్ కొరియా వ్యాధి నియంత్రణ, నివారణ సంస్థ స్పష్టం చేసింది. దీంతో సౌత్‌కొరియాలో కేసుల సంఖ్య 82 లక్షలకు చేరింది.

ఈ ఏడాది జనవరి చివరి వారంలో సౌత్‌కొరియాలో తొలిసారి కరోనా కేసుల సంఖ్య ఐదంకెలు దాటింది. అప్పటి నుంచి వైరస్‌ వ్యాప్తి పెరుగుతోంది. మార్చి 9న కేసుల సంఖ్య 3 లక్షలు దాటింది. తర్వాత వారం రోజుల్లోనే కేసుల సంఖ్య రెట్టింపయింది. మరోవైపు మరణాలు కూడా భారీగా నమోదవుతున్నాయి. బుధవారం 429 మంది వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటివరకూ ఒక్కరోజులో నమోదైన కరోనా మరణాల పరంగా ఇదే అత్యధికమని అధికారులు స్పష్టం చేశారు.

సౌత్ కొరియాలో కేసుల పెరుగుదలకు ఒమిక్రాన్ వేరియంట్‌తో పాటు ఆంక్షల సడలింపే కారణమని తెలుస్తోంది. వైరస్‌ ఉద్ధృతి పెరుగుతున్నా...మరోసారి కఠిన ఆంక్షలు విధించేందుకు అక్కడి ప్రభుత్వం సుముఖంగా లేనట్లు తెలుస్తోంది. చిన్నవ్యాపారులు, స్వయం ఉపాధి బృందాల నుంచి ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో మరిన్ని ఆంక్షలు సడలించేందుకు సర్కార్ ప్రయత్నాలు చేస్తోంది.

ప్రస్తుతం రాత్రి 11 గంటల తర్వాత బిజినెస్ కర్ఫ్యూ అమల్లో ఉంది. దీంతో పాటు బహిరంగ ప్రదేశాల్లో ప్రైవేట్ కార్యక్రమాల్లో ఆరుగురు కంటే ఎక్కువ మంది పాల్గొనకూడదనే ఆంక్షలు ఉన్నాయి. వీటిని కూడా సడలిస్తే పరిస్థితి మరింత దారుణంగా తయారయ్యే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story