Kim Jong Un: దక్షిణ కొరియా నెంబర్ వన్ శత్రుదేశం..

దేశ రాజ్యాంగాన్ని మార్చేయాలని ఉత్తర కొరియా నేత కిమ్ జాంగ్ ఉన్ పిలుపునిచ్చారు. దక్షిణ కొరియాను నెంబర్ వన్ శత్రుదేశంగా ఆ రాజ్యాంగంలో పేర్కోవాలని కిమ్ ఆదేశించారు. సోమవారం జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో ప్రసంగిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. దక్షిణ కొరియాను పూర్తిగా ఆక్రమించాలన్న సందేశాన్ని కూడా ఆయన ఇచ్చారు. ఆ దేశంతో జరిగిన అన్ని ఒప్పందాలను రద్దు చేయాలన్నారు. యుద్ధ మేఘాలు కమ్ముకున్న నేపథ్యంలో దక్షిణ కొరియాను సంపూర్ణంగా ఆక్రమించేయాలన్నారు. మళ్లీ రిపబ్లిక్ ఆఫ్ కొరియాను స్థాపించాలన్నారు.
పార్లమెంట్ ప్రసంగంలో భాగంగా ఆయన ఓ ప్రతిజ్ఞ కూడా చేశారు. కొరియా ద్వీపకల్ప ఏకీకరణ సమయంలో నిర్మించిన రీయునిఫికేషన్ స్థూపాన్ని కూల్చివేయాలని కిమ్ పేర్కొన్నారు. ఆ భారీ స్థూపం నేత్రాలకు వేదన మిగులుస్తోందని ఆయన విమర్శించారు. నార్త్ కొరియా రాజధాని ప్యోంగ్‌యాంగ్‌లో ఆ స్థూపాన్ని కిమ్ తండ్రి నిర్మించారు. దక్షిణి కొరియాతో తరుచూ విబేధాలకు వెళ్తున్న నార్త్ కొరియా ఇటీవల ఒకటే పనిగా మిస్సైళ్లను పరీక్షిస్తున్న విషయం తెలిసిందే. ఓ వివాదాస్పద దీవి వద్దకు వందల సంఖ్యలో ఆర్టిల్లరీ బాంబులను ప్రయోగించింది. దక్షిణ కొరియాతో సయోధ్య మరియు పునరేకీకరణను ప్రోత్సహించే అనేక ప్రభుత్వ సంస్థలను ఉత్తర కొరియా కూల్చివేసింది. తమ దేశం యుద్ధాన్ని తప్పించుకోకూడదని కిమ్ జోంగ్ ఉన్ హెచ్చరించారు. ఈ సందర్భంగా ఉత్తర కొరియా పార్లమెంట్ అయిన సుప్రీం పీపుల్స్ అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ.. దక్షిణ కొరియాతో ఇకపై ఏకీకరణ సాధ్యం కాదని అన్నారు. దక్షిణ కొరియాను ప్రత్యేక ‘శత్రువు దేశం’గా మార్చేందుకు రాజ్యాంగ సవరణ చేయాలని పిలుపునిచ్చారు.
అయితే, సౌత్- నార్త్ కొరియా దేశాల మధ్య సయోధ్యను కుదిర్చేందుకు శాంతియుత పునరేకీకరణ కమిటీ, నేషనల్ ఎకనామిక్ కోఆపరేషన్ బ్యూరోతో పాటు ఇంటర్నేషనల్ టూరిజం అడ్మినిస్ట్రేషన్ అనే మూడు సంస్థలు మూసివేయబడతాయని సుప్రీం పీపుల్స్ అసెంబ్లీలో కిమ్ ప్రకటన విడుదల చేశాడు. ప్యోంగ్యాంగ్ ఇటీవల నిర్వహించిన క్షిపణి పరీక్షల పరంపర తర్వాత రెండు దేశాల మధ్య సంబంధాలు మరింత క్షీణించాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com