South Korea: దక్షిణ కొరియాలో కుక్క మాంసంపై నిషేధం

దేశంలో కుక్క మాంసం వినియోగాన్ని నిషేధిస్తూ దక్షిణ కొరియా పార్లమెంట్ కీలక బిల్లును ఆమోదించింది. తాజా బిల్లు ప్రకారం.. ఈ నిబంధనలు ఉల్లంఘించిన వారికి గరిష్ఠంగా రెండేండ్ల జైలు శిక్ష లేదా సుమారు రూ.19 లక్షల జరిమానా విధిస్తారు. దక్షిణ కొరియాలో కుక్క మాంసంపై నిషేధం దేశంలో కుక్క మాంసం వినియోగాన్ని నిషేధిస్తూ దక్షిణ కొరియా పార్లమెంట్ కీలక బిల్లును ఆమోదించింది.
మనం కోళ్లు, మేక, గొర్రె మాంసం ఎలా తింటామో దక్షిణ కొరియా వాళ్లు కుక్క మాంసంను అంత ఇష్టంగా తింటారు. ఎన్నో శతాబ్దాల నుంచి దక్షిణకొరియాలో కుక్క మాంసం వినియోగంలో ఉంది. అయితే.. తాజాగా ఆ దేశ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కుక్క మాంసం వినియోగాన్ని నిషేదిస్తూ ఆ దేశ పార్లమెంట్ కొత్త చట్టాన్ని రూపొందించింది. ఇందుకు సంబంధించిన బిల్లుకు అసెంబ్లీలో 208-0 ఓట్ల తేడాతో మంగళవారం ఆమోదం లభించింది. ఈ బిల్లుపై అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ సంతకం చేయనున్నారు.
ఈ బిల్లు ప్రకారం.. కుక్కల్ని చంపడం, బ్రీడింగ్ చేయడం, ట్రేడింగ్, అమ్మకాలపై మూడేండ్ల గ్రేస్ పీరియడ్ తర్వాత 2027 నాటికి పూర్తిగా నిషేధం విధిస్తారు. ఆ తరువాత ఎవరైనా కుక్క మాంసాన్ని వినియోగిస్తే.. వాళ్లకు రెండు నుంచి మూడేళ్ల వరకు జైలుశిక్ష పడనుంది. అయితే.. కుక్క మాంసం తిన్నందుకు మాత్రం జరిమానాలు విధించరు. కాగా.. ఈ బిల్లు పై పలువురు రైతులు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఈ కొత్త చట్టం మూడేళ్లలో అమల్లోకి రానుంది. ఈ లోపు కుక్క మాంసం పెంపకందారులు, రెస్టారెంట్ యజమానులు ప్రత్యామ్నాయ వనరులను అన్వేషించుకోవాలని సూచించింది. వీరికి ప్రభుత్వం పూర్తిగా మద్దతు ఇస్తుందని హామీ ఇచ్చింది. కొత్త చట్టం కారణంగా వీరి వ్యాపారాలు మూత పడనుండడంతో.. పరిహారంపై ఇప్పటి వరకు ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ప్రభుత్వ గణాంకాల ప్రకారం.. దక్షిణ కొరియాలో 2023లో దాదాపు 1,600 కుక్క మాంసం రెస్టారెంట్లు, 1,150 కుక్కల ఫారమ్‌లు ఉన్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com