South Korea: దక్షిణ కొరియా అధ్యక్షుడిపై నేరాభియోగాలు

అభిశంసనకు గురైన దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్‌పై నేరాభియోగాలను ఆదివారం ప్రాసిక్యూటర్లు నమోదు చేశారు. గత ఏడాది డిసెంబరు 3న 6 గంటలపాటు ఆయన దేశంలో మార్షల్ లా విధించి, తిరుగుబాటుకు పాల్పడినట్లు ఈ కేసులో పేర్కొన్నారు. ఈ నేరారోపణలు రుజువైతే ఆయనకు మరణ శిక్ష లేదా యావజ్జీవ కారాగారవాస శిక్ష పడవచ్చు.
మార్షల్ లా విధించిన తర్వాత యూన్‌ను పార్లమెంటు అభిశంసించింది. ఆ తర్వాత ఆయనను అరెస్ట్ చేశారు. ఆయనను తిరిగి దేశాధ్యక్షునిగా పునరుద్ధరించాలా? లేక డిస్మిస్ చేయాలా? అనే అంశాన్ని రాజ్యాంగ న్యాయస్థానం పరిశీలిస్తున్నది. మరోవైపు క్రిమినల్ జ్యుడిషియల్ ప్రొసీడింగ్స్ కొనసాగుతున్నాయి. అయితే పరిపాలనలో భాగంగానే తాను చట్టబద్ధంగా మార్షల్ లా విధించానని యూన్ తెలిపారు.
ప్రతిపక్షాలు దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాయని ఆరోపిస్తూ గతేడాది డిసెంబరులో దక్షిణ కొరియా అధ్యక్షుడు ఎమర్జెన్సీ మార్షల్ లా విధించారు. దీనిపై తీవ్ర వ్యతిరేకత రావడం వల్ల యూన్ సుక్ తన ప్రకటనను విరమించుకున్నారు. కానీ ఆయన తన పదవికి రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. ఈ నేపథ్యంలో మార్షల్ లా అమలును వ్యతిరేకిస్తూ తీర్మానం తీసుకువచ్చాయి. ఆ తర్వాత పార్లమెంట్ ఏకగ్రీవంగా ఆమోదించింది. అనంతరం మార్షల్ లా అమలు చట్టవిరుద్ధం అంటూ స్పీకర్ ప్రకటించారు.
మార్షల్ లా ఉత్తర్వులు జారీ చేసి దేశాన్ని సంక్షోభంలోకి నెట్టినందుకు ఆయనకు వ్యతిరేకంగా విపక్షాలు పార్లమెంట్(జాతీయ అసెంబ్లీ)లో అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టాయి. తీర్మానానికి అనుకూలంగా 204 మంది ఓటేయగా 85 మంది మాత్రమే వ్యతిరేకించారు. దీంతో ఆయన అభిశంసనకు గురై అధ్యక్ష అధికారాలను కోల్పోయారు. మరోవైపు అత్యవసర పరిస్థితి విధించిన నేపథ్యంలో దానిపై విచారించేందుకు దర్యాప్తు అధికారులు పలుమార్లు సమన్లు జారీ చేశారు. వాటికి ఆయన స్పందించకపోవడం వల్ల కోర్టును ఆశ్రయించగా అరెస్టు వారెంట్ జారీ అయ్యింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com