Spain flash floods: స్పెయిన్ లో వరద , 158 మంది మృతి

స్పెయిన్‌ను భారీ వర్షాలు, వరదలు అతలాకుతలం చేశాయి. కనీవినీ ఎరుగని రీతిలో భారీ వర్షాలు, వరదలు సృష్టించిన భీభత్సం తీవ్ర విషాదాన్ని నింపాయి. భారీ వర్షాలతో అనేక ప్రాంతాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. అనేక ఇళ్లు నేలమట్టం అయ్యాయి. వందలాది కార్లు కొట్టుకుపోయాయి. వరదల కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 158కి చేరుకోగా, కేవలం వాలెన్సియాలోనే 155 మంది మృతి చెందినట్లు గుర్తించారు.
జాతీయ సంతాప దినాలు ప్రకటన
తూర్పు వాలెన్సియా, కాస్టెల్లాన్ నగరాల నివాసితులు తమ ఇళ్లలోనే ఉండి అత్యవసర సేవల కాల్‌లను అనుసరించాలని ప్రధాన మంత్రి పెడ్రో శాంచెజ్ అభ్యర్థించారు. సాధ్యమైనంత ఎక్కువ మంది ప్రాణాలను కాపాడడమే ప్రస్తుతానికి అత్యంత ముఖ్యమైన విషయం అని ఆయన అన్నారు. ప్రధానమంత్రి మూడు రోజుల జాతీయ సంతాప దినాలు ప్రకటించారు.
ఈ వరదల్లో 1,200 మందికి పైగా సైనికులు గురువారం పట్టణాలు, గ్రామాలలో ప్రాణాలతో బయటపడటానికి.. శిధిలాల రోడ్లను క్లియర్ చేయడానికి శోధించినట్లు తెలిసింది. ఇంకా చాలా మంది గల్లంతైనందున మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని ప్రభుత్వ మంత్రులు హెచ్చరించారు. వర్షం కారణంగా, రెస్క్యూ సిబ్బంది చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
పలు హెచ్చరికలు జారీ
మరోవైపు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. బురదమయమైన వరద వల్ల చాలా వాహనాలు కొట్టుకుపోయాయంటే వర్షం ఎంత ఉందో అంచనా వేయవచ్చు. ప్రజలు తమ ప్రాణాలను కాపాడుకునేందుకు ఇళ్ల పైకప్పులపైకి ఎక్కుతూనే ఉన్నారు. బలమైన నీటి ప్రవాహానికి పలువురు కొట్టుకుపోగా, బురదలో కూరుకుపోయి పలువురు మృతి చెందారు. రోడ్డు, రైలు రవాణాకు తీవ్ర అంతరాయం ఏర్పడిందని, వందలాది మంది ప్రజలు తాత్కాలిక నివాసాలలో ఆశ్రయం పొందుతున్నారని రవాణా మంత్రి ఆస్కార్ పుయెంటె సోషల్ మీడియాలో తెలిపారు. మాడ్రిడ్, వాలెన్సియా మధ్య హై-స్పీడ్ లైన్‌ను తిరిగి తెరవడానికి మూడు వారాలు పట్టవచ్చని అతను చెప్పాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com