Aga Khan: ఆధ్యాత్మిక వేత్త ఆగాఖాన్ కన్నుమూత

బిలియనీర్, పద్మవిభూషణ్ గ్రహీత, ప్రపంచ ఇస్మాయిలీ ముస్లింల ఆధ్యాత్మిక గురువు ఆగాఖాన్ కన్నుమూశారు. ఈ విషయాన్ని ఆగా ఖాన్ ఫౌండేషన్ ప్రకటించింది.
బిలియనీర్, ప్రపంచ ఇస్మాయిలీ ముస్లింల ఆధ్యాత్మిక గురువు ఆగాఖాన్ (Aga Khan) కన్నుమూశారు. పోర్చుగల్‌లోని లిస్బన్‌లో తుదిశ్వాస విడిచారని ఆగాఖాన్ ఫౌండేషన్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. ఆగాఖాన్ కుటుంబానికి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇస్మాయిలీ కమ్యూనిటీకి సంతాపం తెలియజేస్తున్నామని తెలిపింది. ప్రపంచంలోని వ్యక్తులంతా మతపరమైన భేదాలు లేకుండా ఆయన కోరుకున్నట్లుగా ప్రజల జీవితాన్ని మెరుగుపరిచేందుకు తమ భాగస్వాములతో కలిసి పనిచేస్తామని చెప్పింది.
బ్రిటన్ పౌరసత్వం కలిగిన 88 ఏండ్ల ఆగాఖాన్ స్విట్జర్లాండ్‌లో జన్మించారు. 1957లో తన 20 ఏండ్ల వయస్సులో ఇస్మాయిలీ ముస్లింల 49వ వంశపారంపర్య ఇమామ్‌గా నియమితులయ్యారు. వారసత్వంగా వస్తున్న గుర్రపు పెంపకంతోపాటు అనేక ఇతర వ్యాపారాల్లో రాణించారు. యూకే, ఫ్రాన్స్, ఐర్లాండ్ వంటి దేశాల్లో నిర్వహించే గుర్రాల రేసుల్లో ఆయన పాల్గొన్నారు. షేర్గర్ జాతికి చెందిన గుర్రంతో ఆయన రేసుల్లో పాల్గొనేవారు.
1967లో ఆగాఖాన్ డెవలప్‌మెంట్ నెట్‌వర్క్‌ను స్థాపించారు. ఇది ప్రపంచంలోనే వందిలాది దవాఖానలు, విద్యా, సాంస్కృతిక సంస్థలను అభివృద్ధి చేయడంతోపాటు నిర్వహిస్తున్నది. ఆయన సేవలకు గాను 2015లో కేంద్ర ప్రభుత్వం పద్మవిభూషణ్‌తో సంత్కరించింది. నాటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా అత్యున్నత పౌరపురస్కారాన్ని అందుకున్నారు. కాగా, ఇస్మాయిలీ ముస్లింలు ప్రపంచవ్యాప్తంగా 15 మిలియన్ల మంది ఉన్నారు. వారిలో 5 లక్షల మంది పాకిస్థాన్‌లో ఉన్నారు. అదేవిధంగా భారత్, అఫ్గానిస్థాన్, ఆఫ్రికాలో కూడా ఇస్మాయిలీ ముస్లిం జనాభా ఉన్నది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com