Sri Lanka: అధ్యక్షుడు పరార్.. లంకలో ఎమర్జెన్సీ

Sri Lanka: అధ్యక్షుడు పరార్.. లంకలో ఎమర్జెన్సీ
Sri Lanka: శ్రీలంక మరోసారి ఆందోళనలతో అట్టుడుకుతోంది. అధ్యక్షుడు గొటబాయ రాజపక్స రాత్రికి రాత్రి భార్య,

Sri Lanka: శ్రీలంక మరోసారి ఆందోళనలతో అట్టుడుకుతోంది. అధ్యక్షుడు గొటబాయ రాజపక్స రాత్రికి రాత్రి భార్య,ఇద్దరు సెక్యూరిటీ గార్డ్స్‌తో మాల్దీవులకు పరారవడంతో ఆందోళనకారులు భగ్గుమన్నారు. అధ్యక్షుడి పరారీకి మిలటరీ అధికారులు సహకరించారంటూ రోడ్లపైకి వచ్చి పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. అటు, అధ్యక్షుడు గొటబాయ పరారవడంతో లంకలో ఎమర్జెన్సీ ప్రకటించారు ప్రధాని రణిల్‌ విక్రమసింఘే. ఈ పరిణామాలన్నీ సంక్షోభాన్ని మరింత తీవ్రతరం చేస్తుండడంతో.. ఆగ్రహం కట్టలు తెగి నిరసనకారులు ఆందోళనల్ని మరింత తీవ్రతరం చేశారు. ప్రధాని విక్రమసింఘే నివాసం ముట్టడించిన వేలాది మంది ఆందోళనకారులు రాళ్ల వర్షం కురిపించారు. దీంతో.. వారిని కంట్రోల్‌ చేసేందుకు పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు.

ముందుగా చెప్పిన మాట ప్రకారం గొటబాయ ఇవాళ రాజీనామా చేసి అధికార బదలాయింపునకు సహకరించాల్సి ఉంది. ఐతే.. రాజీనామా తర్వాత తనను అరెస్టు చేస్తారేమోననే భయంతో ఆయన దేశం విడిచి వెళ్లిపోయారు. సోమవారం ఓసారి దుబాయ్ వెళ్లేందుకు ప్రయత్నించినా కుదరకపోవడంతో నిన్న రాత్రి మిలటరీ ఎయిర్‌క్రాఫ్ట్‌ ఆంటోనోవ్‌-23లో మాల్దీవులకు పరారయ్యారు. ఐతే.. అక్కడ ఆయన ల్యాండింగ్‌కి అనుమతి ఇచ్చే విషయంలో మొదట నిరాకరించినా చివరికి ల్యాండయ్యారు.

త్వరలోనే గొటబాయ మాలే నుంచి యూఏఈ వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అధ్యక్షుడి రాజీనామా తనకు అందలేదని స్పీకర్‌ కార్యాలయం ప్రకటించింది. ఈ నేపథ్యంలో శ్రీలంకలో ఎమర్జెన్సీ విధిస్తూ ప్రధాని నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం ఆయన నివాసాన్ని కూడా చుట్టుముట్టిన జనం.. తక్షణం రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఆర్థిక సంక్షోభానికి ఈ రాజకీయ పరిణామాలు కూడా తోడవడంతో లంకలో కల్లోల పరిస్థితులు కనిపిస్తున్నాయి.

ప్రధాని నివాసం నుంచి పార్లమెంట్ వరకూ మార్చ్ చేస్తున్న ఆందోళనకారులు.. పారిపోయిన గొటబాయతోపాటు విక్రమసింఘే కూడా రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు.

Tags

Next Story