Sri lanka Crisis : లంకలో బతుకీడ్చలేక శరణార్థులుగా భారత్‌‌కి వస్తున్న లంకేయులు..!

Sri lanka Crisis : లంకలో బతుకీడ్చలేక శరణార్థులుగా భారత్‌‌కి వస్తున్న లంకేయులు..!
Sri lanka Crisis : శ్రీలంక తన చరిత్రలో ఎన్నడూ లేనంతగా ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. శ్రీలంక విదేశీ కరెన్సీ రావడానికి ప్రధాన వనరైన టూరిజం..

Sri lanka Crisis : శ్రీలంక తన చరిత్రలో ఎన్నడూ లేనంతగా ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. శ్రీలంక విదేశీ కరెన్సీ రావడానికి ప్రధాన వనరైన టూరిజం..కోవిడ్ సంక్షోభం కారణంగా తీవ్రంగా దెబ్బతింది. టూరిస్టులు తగ్గిపోవడంతో విదేశీ కరెన్సీ నిల్వలు భారీగా తగ్గిపోయాయి. 2019లో జరిగిన వరుస బాంబు పేలుళ్లు కూడా శ్రీలంక టూరిజంపై ఎఫెక్ట్ చూపాయి. ఇది ఆ దేశ ఆర్థిక వ్యవస్థ సహా విదేశీ నిల్వలపై ప్రత్యక్ష ప్రభావం చూపింది. కరోనా సంక్షోభం సమయంలో చైనా నుంచి ఎడాపెడా అప్పులు చేయడం...శ్రీ లంక కొంప ముంచింది. రోజువారీ నిత్యావసరాల విషయంలో ఎక్కువగా దిగుమతులపైనే ఆధారపడడం కూడా శ్రీలంక ఆర్థిక సంక్షోభానికి కారణమని నిపుణులు చెప్తున్నారు.

ఆర్థిక సంక్షోభం కారణంగా శ్రీలంకలో నిత్యావసరాల కొరత, విద్యుత్‌ సరాఫరాలో తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇది దేశవ్యాప్త నిరసనలకు దారి తీసింది. శ్రీలంకలో విదేశీ కరెన్సీ నిల్వలు తగ్గిపోవడంతో ద్రవ్యోల్బణం పెరిగిపోయింది. దిగుమతులపైన కూడా తీవ్ర ప్రభావం చూపింది. ఇది నిత్యవసరాల సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అటు పెట్రోల్ రేట్లు అమాంతం పెరిగిపోయాయి. ఇంధన కొరత కారణంగా దేశవ్యాప్తంగా ప్రజలు నిరసనలకు, ఆందోళనలకు దిగుతున్నారు. పెట్రోల్‌ బంక్‌ల దగ్గర భారీ క్యూ లైన్లు కనిపిస్తున్నాయి. పలు చోట్ల పెట్రోల్,డీజిల్‌ కోసం క్యూలో నిలబడి వయస్సు పైబడిన వారు ప్రాణాలు కోల్పోయిన సందర్భాలున్నాయి. పేపర్ల కొరత కారణంగా విద్యార్థులను అన్ని రకాల పరీక్షలను ఇప్పటికే నిలిపివేసింది శ్రీలంక సర్కార్.

ప్రస్తుత పరిస్థితుల్లో శ్రీలంకలో బతకలేక చాలా మంది లంకేయులు ఇండియాకు శరణార్థులుగా వస్తున్నారు. శ్రీలంక ఉత్తర ప్రాంతాలైన జాఫ్నా, మన్నార్‌, కొకుపడయాన్‌ల నుంచి చాలా మంది భారత్‌కు శరణార్థులుగా వస్తున్నారు. మంగళవారం 8 మంది పిల్లలు, ఐదుగురు మహిళలు సహా 16 మంది రెండు జట్లుగా మత్స్యకారుల పడవల్లో భారత సముద్ర జలాల్లోకి ప్రవేశించారు. ఆరుగురు ఉన్న జట్టును రామేశ్వరం తీరానికి దగ్గర అరైచన్‌ మునై దగ్గర నాలుగో దీవిలో మత్స్యకారులు దించేశారు. అక్కడ ఆకలితో అలమటిస్తున్న ఆరుగురిని ఇండియన్ కోస్టు గార్డు రక్షించింది. తర్వాత వారిని తమిళనాడు పోలీసులకు అప్పగించారు.

ఆహార కొరత,నిరుద్యోగం కారణంగా ఇండియాకు వలస వస్తున్నట్లు బాధితులు చెప్పారు. భారత్‌కు రావడానికి మొదటి జట్టు మత్స్యకారులకు 50 వేల రూపాయలు చెల్లించగా...రెండో జట్టు 3 లక్షల రూపాయలు చెల్లించిందని వారు చెప్పారు. రెండో బోటు సాంకేతిక కారణాలతో సముద్రం మధ్యలోనే నిలిచిపోయిందని వివరించారు. తెల్లవారు వారు పాంబన్ బ్రిడ్జి దగ్గరకు చేరుకున్నారు. ఇక రాబోయే రోజుల్లో భారత్‌కు వలసలు మరింత ఎక్కువగా ఉండొచ్చంటున్నారు నిపుణులు.

ఇక మరోవైపు కష్టకాలంలో ఉన్నాం ఆదుకోవాలన్న శ్రీలంక విజ్ఞప్తిని చైనా తిరస్కరించింది. అప్పులను రీ షెడ్యూల్‌ చేయాలన్న ప్రతిపాదనకు నో చెప్పినట్లు సమాచారం. ఇదే సమయంలో శ్రీలంక ఆర్థిక మంత్రి బసిల్ రాజపక్సే ఇటీవల రెండు రోజుల పర్యటన కోసం భారత్ వచ్చారు. ఈ సందర్భంగా అత్యవసరమైన ఆహారం, మందుల సేకరణ కోసం శ్రీలంకకు 1 బిలియన్ యూఎస్‌ డాలర్ల ఆర్థికసాయం ప్రకటించింది ఇండియా. పెట్రోలియం ఉత్పత్తుల కొనుగోలు చేసేందుకు మరో 500 మిలియన్ రుణ సాయం ప్రకటించింది.

శ్రీలంకలో రాజపక్స కుటుంబం ఇప్పుడు పాలన కొనసాగిస్తోంది. ప్రధానిగా అన్న మహీంద రాజపక్స, తమ్ముడు గోటబయ రాజపక్స అధ్యక్షుడిగా. మరో తమ్ముడు బసిల్ రాజపక్స ఆర్థిక మంత్రిగా కొనసాగుతున్నారు. వీరు అనుసరిస్తున్న విధానాలు శ్రీలంకకు ఉరితాళ్లుగా మారాయి. 2019 ఎన్నికల్లో గోటబయ ఘనవిజయం సాధించారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీల అమలుకు చేపట్టిన చర్యలు, తప్పుడు ఆర్థిక విధానాలతో శ్రీలంక ఆర్థిక పరిస్థితి కుదేలైంది.

Tags

Read MoreRead Less
Next Story