UK: ఉక్రెయిన్ కు బ్రిటన్ సంపూర్ణ మద్దతు

ఐరోపా భద్రత కోసం కలిసి పనిచేద్దామని, తరానికోసారి తలెత్తే ఇలాంటి సందర్భంపై గట్టిగా స్పందించాల్సిన అవసరముందని బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ పిలుపునిచ్చారు. ఉక్రెయిన్‌కు మంచి జరిగే ఒప్పందం ద్వారానే ప్రతి దేశం భద్రత ఆధారపడి ఉందని, ఇతరులకు కూడా ఇదే ముఖ్యమని స్పష్టం చేశారు. ఉక్రెయిన్- రష్యా యుద్ధం ముగింపునపై చర్చించేందుకు ఆదివారం లండన్‌లో జరిగిన ఐరోపా దేశాధినేతల సమావేశంలో స్టార్మర్ ఈ వ్యాఖ్యలు చేశారు.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ మధ్య శాంతి చర్చలు విఫలమైన నేపథ్యంలో స్టార్మర్ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్‌తోపాటు జర్మనీ, డెన్మార్క్, ఇటలీ, నెదర్లాండ్స్, నార్వే, పోలండ్, స్పెయిన్, కెనడా, ఫిన్లాండ్, స్వీడన్, ద చెక్ రిపబ్లిక్, రొమేనియా తదితర దేశాధినేతలు దీనికి హాజరయ్యారు. నాటో సెక్రటరీ జనరల్, యూరోపియన్ కమిషన్, యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షులు వచ్చారు. వారంతా ఉక్రెయిన్‌కు మద్దతు పలికారు. కాల్పుల విరమణ కోసం ఐరోపా దళాలను ఉక్రెయిన్‌కు పంపడంపైనా ఈ సమావేశంలో చర్చ జరుగుతోంది.
ఐరోపా దేశాల సమావేశానికి ముందు స్టార్మర్, మెక్రాన్, జెలెన్‌స్కీ భేటీ అయ్యారు. రష్యాతో కాల్పుల విరమణ ఒప్పంద ప్రణాళికపై కలిసి పని చేయాలని నిర్ణయించారు. ఆ ప్రణాళికను అమెరికా ముందుంచాలని అనుకున్నారు. 'బ్రిటన్, ఫ్రాన్స్, మరో రెండు మూడు దేశాలు కలిసి యుద్ధాన్ని ఆపే ప్రణాళికపై పని చేస్తాయి. ఆ తర్వాత ఆ ప్రణాళికపై అమెరికాతో చర్చిస్తాం' అని స్టార్మర్ తెలిపారు. తాను పుతిన్‌ను నమ్మబోనని, ట్రంప్‌పై నమ్మకముందని పేర్కొన్నారు.
అమెరికా నుంచి భద్రతపై హామీ గురించి తీవ్రంగా చర్చిస్తున్నామని వెల్లడించారు. 'ఒకవేళ యుద్ధాన్ని ముగించేందుకు ఒప్పందం కుదిరితే భద్రతకు హామీ ఉండాల్సిందే. లేదంటే పుతిన్ మళ్లీ వస్తారు. గతంలో ఇలాగే జరిగింది. అదే నిజమైన ప్రమాదం. అందుకే ఒప్పందమంటూ జరిగితే అది శాశ్వతంగా ఉండాలి. తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం వద్దే వద్దు' అని స్టార్మర్ స్పష్టం చేశారు.
విజయవంతమైన శాంతి ఒప్పందానికి మూడు అంశాలు అవసరమని స్టార్మర్ తెలిపారు. అందులో మొదటిది ఉక్రెయిన్ బలంగా ఉండటానికి ఆ దేశానికి ఆయుధాలను అందించడం, రెండోది భద్రతకు హామీ ఇచ్చేలా ఐరోపా బలగాల మోహరింపు, మూడోది హామీలను మీరకుండా పుతిన్‌ను అమెరికా నిలువరించడం అవసరమని అభిప్రాయపడ్డారు. వీటి కోసమే తాను పని చేస్తున్నానని తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com