Erdogan: ఇజ్రాయెల్‌ దాడులను వెంటనే ఆపేయాలి: తుర్కియే అధ్యక్షుడు

Erdogan: ఇజ్రాయెల్‌ దాడులను వెంటనే ఆపేయాలి: తుర్కియే అధ్యక్షుడు
ఇజ్రాయెల్‌ దాడుల వెనుక పాశ్చాత్య దేశాల కుట్ర ఉందని ఆరోపణ

పాశ్చాత్య శక్తులే గాజాలో ఇజ్రాయెల్‌ సృష్టిస్తున్న నరమేథంలో ప్రధాన నిందితులని తుర్కియే అధ్యక్షుడు రెసెప్‌ తయ్యిప్‌ ఎర్డోగాన్‌ వ్యాఖ్యానించారు. పాలస్తీనా హక్కులకు అనుకూలంగా ఇస్తాంబుల్‌లో లక్షా 50 వేల మంది పాల్గొన్న భారీ ర్యాలీలో ఎర్డోగాన్ పాల్గొన్నారు. మనసాక్షితో ఆలోచిస్తే పశ్చిమ దేశాలే ఈ మారణకాండకు కారణమని బోధపడుతుందని ఎర్డోగాన్‌ అన్నారు. ప్రతీ దేశానికి తమను తాము రక్షించుకునే హక్కు ఉంటుందనీ.. అయితే ఇజ్రాయెల్‌ చేస్తోంది ఆత్మరక్షణ చర్య కాదన్నారు. అన్యాయంగా పిల్లలను, మహిళలను, పౌరులను బలి తీసుకుంటోందని మండిపడ్డారు. ఉక్రెయిన్‌లో పౌరులు మరణిస్తున్నారని మొసలి కన్నీళ్లు పెట్టుకునే పాశ్చాత్య దేశాలకు ఇక్కడి పౌర మరణాలు కనిపించట్లేదా.. ఇది ద్వంద్వ వైఖరి కాదా.. అని నిలదీశారు. వేల ఏళ్ల క్రితం జరిగిన క్రూసేడ్లను ఇజ్రాయెల్‌ దాని మిత్రదేశాలు మళ్లీ ప్రేరేపిస్తున్నాయని ఆరోపించారు.


గాజాపై ఇజ్రాయెల్‌ చేస్తున్న దాడులను వెంటనే ఆపాలని ఎర్డోగాన్‌ డిమాండ్ చేశారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా కూడా స్పందించారు. ఇజ్రాయెల్‌ దాడుల వెనుక పాశ్చాత్య దేశాల కుట్ర ఉందని ఆరోపించారు. ఇజ్రాయెల్‌ దాడులను వెంటనే ఆపేయాలని, ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా పాలస్తీనా ప్రజలకు మద్దతుగా నిలుస్తామని తెలిపారు. ఏ దేశానికైనా తనను తాను రక్షించుకునే హక్కు ఉంటుందని, కానీ ఈ ఘర్షణలో న్యాయం ఎక్కడుందని ప్రశ్నించారు.


మరోవైపు గాజాలోకి పదాతిదళాల ప్రవేశంతో హమాస్‌పై రెండవ దశ యుద్ధం ప్రారంభమైందని ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహు చెప్పారు. శత్రువును ఓడించి, దేశంలో తమ ఉనికిని స్థిరీకరించడమే యుద్ధ లక్ష్యమని పేర్కొన్నారు. హమాస్ పాలనా, సైనిక సామర్థ్యాన్ని నాశనం చేసి, బందీలను స్వదేశానికి తిరిగి తీసుకువస్తామని వివరించారు. ప్రభుత్వంలోని వార్ క్యాబినెట్, సెక్యూరిటీ క్యాబినెట్లు భూతల దాడులను చేయాలని ఏకగ్రీవంగా నిర్ణయించాయని వెల్లడించారు. ఆస్పత్రుల కోసం తరలిస్తున్న ఇంధనాన్ని హమాస్‌ యుద్ధ సామాగ్రి కోసం వాడుతోందని ఆరోపించారు. భూతల యుద్ధంలో తమ సైన్యానికి ప్రమాదం సంభవించకుండా ఉండేందుకే.. గాజాలో భీకర వైమానిక దాడులు చేశామన్నారు. పాలస్తీనా మహిళలు, చిన్నారులపై ఇజ్రాయెల్‌ సైనికులు.. దాడులు చేస్తున్నట్లు సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వీడియోలు, ఆరోపణలపై నెతన్యాహు స్పందించారు. తమ సైన్యం అలా యుద్ధనేరాలు చేయబోదని తెలిపారు. అంతకుముందు హమాస్‌ బందీలుగా చేసుకున్న ఇజ్రాయెల్‌ పౌరుల కుటుంబీకులను నెతన్యాహు కలుసుకున్నారు. వీలైనంత తొందరగా వారిని తీసుకొస్తామని హామీ ఇచ్చారు.

Tags

Read MoreRead Less
Next Story