US Storm: అమెరికాలో తుఫాను విధ్వంసం.. 34 మంది మృతి

అగ్రరాజ్యం అమెరికాలో తీవ్ర తుఫాను విధ్వంసం సృష్టించింది. భీకరమైన గాలులతో విరుచుకుపడి అనేక ఇళ్లను నేలమట్టం చేసింది. తుఫాను ధాటికి 34 మంది మరణించినట్లుగా సమాచారం. టోర్నడోలు అమెరికాలోని కొన్ని ప్రాంతాలను అతలాకుతలం చేశాయి. షెర్మాన్ కౌంటీలో దుమ్ము తుఫాను కారణంగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎనిమిది మంది మరణించారు. మూడు కౌంటీలలో ఆరుగురు మరణించారని, ముగ్గురు తప్పిపోయారని మిస్సిస్సిప్పి గవర్నర్ టేట్ రీవ్స్ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 29 మంది గాయపడ్డారని వెల్లడించారు. పదుల సంఖ్యలో వాహనాలు ధ్వంసం అయ్యాయి.
టెక్సాస్ పాన్‌హ్యాండిల్‌లోని అమరిల్లోలో దుమ్ము తుఫాను కారణంగా కారు ప్రమాదాల్లో ముగ్గురు వ్యక్తులు మరణించారని భద్రతా సిబ్బంది తెలిపారు. దేశవ్యాప్తంగా బలమైన గాలులు వీచడం వల్ల ఈ మరణాలు సంభవించాయి. 100 కి పైగా అడవుల్లో మంటలు చెలరేగినట్లు కూడా తెలుస్తోంది. మిన్నెసోటాలోని పశ్చిమ ప్రాంతాలు, దక్షిణ డకోటాలోని తూర్పు ప్రాంతాలకు మంచు తుఫాను హెచ్చరికను జాతీయ వాతావరణ సేవ జారీ చేసింది. 3 నుంచి 6 అంగుళాల మంచు పేరుకుపోయే అవకాశం ఉందని తెలిపింది.శనివారం కూడా పెద్ద టోర్నడోలు సంభవించాయి. తూర్పు లూసియానా, మిస్సిస్సిప్పి నుంచి అలబామా, పశ్చిమ జార్జియా, ఫ్లోరిడా పాన్‌హ్యాండిల్ ప్రాంతాలు ప్రభావితమయ్యాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com