2023 Summer : గత వేసవి.. వాతావరణ పాఠాలు నేర్పింది

వేసవి కాలంలో 40 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉంటేనే అల్లాడిపోతాం. బయట కాలు పెట్టేందుకే జంకుతాం. 40డిగ్రీలకే ఇలా ఉంటే 50డిగ్రీల వరకు రోజువారీ ఉష్ణోగ్రతలు నమోదయ్యే ప్రాంతాలు కూడా ప్రపంచంలో చాలానే ఉన్నాయి. ఈ పరిస్థితి వేసవి కాలం వరకే. అయితే ౨౦౨౩ ఏడాది మొత్తం వాతావరణంపై అధ్యయనం చేసిన ఐరోపాకు చెందిన వాతావరణ మార్పుల సంస్థ E.C.M.R.F ఉలిక్కిపడే విషయాన్ని వెల్లడించింది. గత లక్ష సంవత్సరాల్లోనే 2023 అత్యంత వేడి ఏడాది అని తేల్చింది. 19వ శతాబ్దంలో జరిగిన పారిశ్రామిక విప్లవం ముందు కంటే అత్యంత వేడిగా ఉన్న తొలి సంవత్సరం కూడా ఇదే అని వెల్లడించింది. ఎల్‌నినో కారణంగా 2024 తొలి త్రైమాసికంలో కూడా ఇదే పరిస్థితి ఉంటుందని స్పష్టం చేసింది. 2023లో ప్రపంచ సగటు ఉష్ణోగ్రత 14.98డిగ్రీల సెల్సియస్. ఇంతకు ముందు అత్యధిక ఉష్ణోగ్రత నమోదైన 2016 కంటే ఇది 0.17డిగ్రీల సెల్సియస్ ఎక్కువ. 1991-2020 మధ్య కాలంలోని సగటు కంటే 0.60డిగ్రీల సెల్సియస్, పారిశ్రామికీకరణ ప్రారంభమైన 1850-1900 సంవత్సరం మధ్య కాలం కంటే 1.48డిగ్రీల సెల్సియస్ అధికం. కాలుష్యం, ఎల్‌నినో, ఇతర వాతావరణ అసమానతలే ఇంతటి వేడికి కారణం అని E.C.M.R.F తెలిపింది. సముద్రాలు కూడా 2023లో వేడెక్కినట్లు వివరించింది.
ఉష్ణోగ్రత 1.2డిగ్రీలు పెరిగితేనే ప్రపంచం అంతా ప్రకృతి వైపరిత్యాలు సంభవిస్తున్నాయి. మరి పెరుగుతున్న జనాభా అవసరాలకు అనుగుణంగా రాబోయే రోజుల్లో పారిశ్రామిక కార్యకలాపాలు, వాహనాలు పెరిగి కర్బన ఉద్గారాల వల్ల భూమి మరింత వేడెక్కే ప్రమాదం కనిపిస్తోంది. లక్ష ఏళ్లలో 2023 అధిక వేడి సంవత్సరం అని E.C.M.R.F వెల్లడించిన వివరాలు దీనికి ఓ ఉదాహరణ. ఈ సమాచారం యావత్ ప్రపంచం అప్రమత్తం కావాల్సిన అవసరాన్ని చాటిచెబుతోంది. ప్రకృతి విపత్తులు తప్పించుకోవాలన్నా, వ్యవసాయం దెబ్బతిని ఆకలి కేకలు పెరగకూడదు అన్నా ఇప్పుడే మేలు కోవాలి. కాలుష్యాన్ని తగ్గించి భూ తాపాన్ని నివారించాలి. వృక్షసంపదను కాపాడాలి. అభివృద్ధి దృష్ట్యా పారిశ్రామిక కార్యకలాపాలు, వాహనాలు అవసరమే అయినా వీటి ఇంధనాలకు ప్రత్యామ్నాయాలను వాడాలి. ఎలక్ట్రిక్ వాహనాలను విరివిగా వినియోగించాలి. సౌర, పవన విద్యుత్ ఉత్పత్తిని పెంచాలి. వాహనాలతో పాటు నౌకలు, విమానాల్లోనూ పునరుత్పాదక ఇంధనాన్ని వినియోగం పెరగాలి. వాతావరణంలో మీథేన్‌ను తగ్గించడానికి ప్రపంచ దేశాలు 2021లో కుదుర్చుకున్న ఒప్పందాన్ని వేగంగా అమలు చేయాలి. వాతావరణ మార్పులను అధిగమించేందుకు పేద దేశాలకు ధనిక దేశాలు సాయం అందించాలి. ఇవన్నీ సక్రమంగా పాటిస్తేనే వాతావరణ మార్పులను అధిగమించి భూతాపాన్ని కట్టడి చేయగలం. రాబోయే తరానికి తరానికి సురక్షితమైన భూ వాతావరణాన్ని అందించగలం.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com