Sunita Williams: 9 నెలల నిరీక్షణకు తెర.. సునీతా వచ్చేస్తోంది..

Sunita Williams: 9 నెలల నిరీక్షణకు తెర.. సునీతా  వచ్చేస్తోంది..
X
భారతకాలమానం ప్రకారం రేపు భూమికి

ప్రపంచమంతా ఉత్కంఠతతో ఎదురుచూస్తున్న విషయం ఏదైనా ఉందంటే అది సునీతా విలియమ్స్ తిరిగి భూమి మీదకు చేరడమే. 9 నెలల నిరీక్షణకు తెరుపడనున్నది. భారతీయ అమెరికన్ వ్యోమగామి సునీతా రేపు భూమి మీదకు రానున్నది. దాదాపు తొమ్మిది నెలలు అంతరిక్షంలో గడిపిన తర్వాత సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ భారతకాలమానం ప్రకారం రేపు భూమికి తిరిగి వస్తారు. వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ బుధవారం తెల్లవారుజామున భూమికి తిరిగి వస్తారని నాసా ప్రకటించింది. విలియమ్స్, విల్మోర్ నిక్ హేగ్, రోస్కోస్మోస్ వ్యోమగామి అలెగ్జాండర్ గోర్బునోవ్‌లతో కలిసి స్పేస్‌ఎక్స్ క్రూ డ్రాగన్‌లో తిరిగి వస్తారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి స్పేస్‌ఎక్స్ క్రూ భూమికి తిరిగి రావడాన్ని నాసా ప్రత్యక్ష ప్రసారం చేయనుంది.

క్రూ డ్రాగన్ వ్యోమనౌక హ్యాచ్ మూసివేత భారతకాలమానం ప్రకారం మంగళవారం ఉదయం 8.15కు ప్రారంభమవుతుంది. 10.15 గంటలకు ఐఎఎస్ నుంచి విడిపోతుంది. బుధవారం తెల్లవారుజామున 2.40గంటలకు భూవాతావరణంలోకి ప్రవేశిస్తుంది. తెల్లవారుజామున 3.27 గంటలకు సముద్రజలాల్లో క్రూ డ్రాగన్ ల్యాండ్ అవుతుంది. కాగా గతేడాది జూన్‌ 5న ప్రయోగించిన బోయింగ్‌ వ్యోమనౌక ‘స్టార్‌లైనర్‌’లో సునీత, విల్మోర్‌లు ఐఎస్‌ఎస్‌కు చేరుకున్నారు. షెడ్యూల్ ప్రకారం వారం రోజులకే సునీత, విల్మోర్‌ భూమిని చేరుకోవాల్సి ఉంది. అయితే స్టార్‌లైనర్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో వ్యోమగాముల తిరుగు ప్రయాణం సాధ్యపడలేదు.

Tags

Next Story