Sunita Williams: అంతరిక్షంలోనే సునీతా విలియమ్స్..
10 రోజుల అంతరిక్ష యాత్ర కోసం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్.. అక్కడే చిక్కుకుపోయారు. దాదాపు 100 రోజులు పూర్తవుతున్నా ఆమె తిరిగి భూమికి రావడంపై ఇంకా సందిగ్ధత నెలకొంది. దీంతో సునీతా విలియమ్స్ మరికొన్ని నెలల పాటు అంతరిక్షంలోనే ఉండనున్నారు. ఆమెను రప్పించేందుకు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ-నాసా అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నా.. తరచూ ఆలస్యం అవుతూనే ఉంది. సునీతా విలియమ్స్‌తోపాటు ఆమెతో అంతరిక్షంలోకి వెళ్లిన బుచ్ విల్‌మోర్ కూడా అక్కడే ఉన్నారు. వాళ్లను స్పేస్‌లోకి తీసుకెళ్లిన బోయింగ్ కంపెనీకి చెందిన స్టార్‌లైనర్ స్పేస్‌క్రాఫ్ట్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో.. ఇటీవలే దాన్ని ఖాళీగా భూమికి తీసుకువచ్చారు. ఈ క్రమంలోనే నాసా కీలక అప్‌డేట్ ఇచ్చింది. ఈనెల 13వ తేదీన అంతరిక్షం నుంచి సునీతా విలియమ్స్, బచ్ విల్‌మోర్.. స్పేస్‌కాల్‌లో ప్రజలతో సంభాషించనున్నట్లు తెలిపింది.
సెప్టెంబర్ 13వ తేదీన ఎర్త్ టు స్పేస్ కాల్‌లో సునీతా విలియమ్స్, బుచ్ విల్‌మోర్‌లు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి మాట్లాడనున్నట్లు నాసా అధికారులు తెలిపారు. దీనికోసం ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌లో న్యూస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఇందులో ప్రజలను ఉద్దేశించి మాట్లాడనున్న ఇద్దరు వ్యోమగాములు.. ఈ అంతరిక్ష యాత్రలో ఎదురైన సవాళ్లు, వారి అనుభవాలను ఈ స్పేస్ కాల్‌లో పంచుకోనున్నారు. అంతేకాకుండా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఉన్న ల్యాబ్‌లో వారు చేస్తున్న పరిశోధనల గురించి కూడా వెల్లడించే అవకాశం ఉన్నట్లు సమాచారం.
ఈ ఏడాది జూన్ 5వ తేదీన బోయింగ్ సంస్థకు చెందిన స్టార్ లైనర్ స్పేస్‌క్రాఫ్ట్‌లో సునీతా విలియమ్స్, బుచ్ విల్‌మోర్ ఐఎస్ఎస్‌కు చేరుకున్నారు. అయితే 10 రోజుల తర్వాత తిరిగి అదే నెల 14వ తేదీన వారిద్దరూ తిరిగి భూమికి రావాల్సి ఉండగా.. వారు ప్రయాణించిన స్పేస్‌క్రాఫ్ట్‌లోని థ్రస్టర్లలో సాంకేతిక లోపంతోపాటు హీలియం లీకేజీ ఏర్పడింది. ఈ క్రమంలోనే దాన్ని స్పేస్‌క్రాఫ్ట్‌కు బోయింగ్ సంస్థ మరమ్మతులు చేసింది. ఆ తర్వాత స్టార్ లైనర్ స్పేస్‌క్రాఫ్ట్ బాగానే ఉందని.. అందులో వ్యోమగాములను తీసుకురావచ్చని తెలిపింది. అయితే అందులో వారిని తీసుకువచ్చేందుకు నాసా అంగీకరించకపోవడంతో ఖాళీగానే స్పేస్‌క్రాఫ్ట్ భూమిని చేరుకుంది. న్యూ మెక్సికోలోని వైట్ శాండ్స్ స్పేస్ హార్బర్‌లో అది దిగింది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com